జాతకం కాదు... జన్యుక్రమం చూడండి

20 Jul, 2017 07:30 IST|Sakshi
జాతకం కాదు... జన్యుక్రమం చూడండి
- ఒకే కులంలో పెళ్లిచేసుకునేవారి పిల్లలకు కొన్ని రకాల జన్యు వ్యాధులు వచ్చే అవకాశం
సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి
కులాంతర వివాహాలు కొంత బెటర్‌ అంటున్న శాస్త్రవేత్తలు
 
సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి వరకు మేనరికం పెళ్లిళ్లు వద్దని చెప్పిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు ఒకే కులంలో పెళ్లిళ్ల విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లోని వేర్వేరు జన సమూహాల్లో అరుదైన కొన్ని జన్యు వ్యాధు లు ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలి క్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అధ్యయనంలో తేలింది. ఇందుకు ఒకే కులానికి చెందిన వారితో పెళ్లి చేసుకోవడంతో వారి పిల్లలకు ఈ వ్యాధులు వచ్చే అవ కాశం ఉందని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లోని దాదాపు 2,800 మంది జన్యువులను విశ్లేషించడం ద్వారా ఈ అంచనాకొచ్చినట్లు సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్‌ మంగళవారం తెలిపారు. పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి..
 
దక్షిణాసియాలో దాదాపు 5,000 వరకు ప్రత్యేక జనసమూహాలు ఉన్నాయి. వీరిలో చాలామంది కులాంతర వివాహాలు చేసుకోరు. వీరిలో కొన్ని అరుదైన జన్యువ్యాధులు ఉన్నట్లు స్పష్టమైంది. ఉదాహరణకు ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే మత్తు మందు పనిచేయదు. కోస్తా ప్రాంతానికి చెందిన ఓ వర్గ ప్రజలకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే ఇంకో కులం ప్రజల్లో మోకాళ్ల నొప్పులు (ఆర్థరైటిస్‌) సమస్యలు ఎక్కువ. అయితే వీటికి కారణాలు తెలుసుకునేందుకు సీసీఎంబీ నేతృత్వంలో పలు అంతర్జాతీయ సంస్థలు ఓ పరిశోధనను చేపట్టాయి. ఇందులో భాగంగా దక్షిణా సియాలోని దాదాపు 275 భిన్న ప్రాంతాలకు చెందిన 2,800 మంది జన్యుక్రమాన్ని విశ్లేషించారు.

వీరందరిలో దాదాపు వంద తరాలుగా వారసత్వంగా వస్తున్న ఓ డీఎన్‌ఏ భాగాలను గుర్తించారు. ఈ డీఎన్‌ఏ భాగాన్ని ఐడెంటిటీ బై డీసెంట్‌ అని పిలుస్తారు. వీరిలో దాదాపు 81 వర్గాల ప్రజల్లోని జన్యువులో కొన్ని వ్యాధులకు సంబంధించిన మార్పులను గుర్తించారు. ఇందులో భిన్న కులాల, మతాల, భాషలు మాట్లాడే వారు ఉన్నారు. ఈ మార్పులు ఉన్న వ్యక్తులు ఇద్దరు వివాహం చేసు కుంటే.. వ్యాధికారక జన్యుమార్పులు పిల్లలకూ సంక్రమించే అవకాశం ఉంటుంది. కులాంతర వివాహాలు అతితక్కువ కావడం వల్ల ఈ వ్యాధికారక జన్యుమార్పులు ఒక్క కులానికే పరిమితమైపోయాయి. కులాంతర వివాహాల వల్ల జన్యుమార్పిడిల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
జన్యుపరీక్షలు కావాలి..
ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాలనుకునేవారు జాతకాలకు బదులు జన్యు క్రమాలను పరీక్షించుకోవాలని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా చెప్పారు. యూదులు జన్యు పరీక్షల తర్వాతే పెళ్లి చేసుకుంటారని చెప్పారు. డోర్‌ యషోరిమ్‌ అనే వెబ్‌సైట్‌ యూదుల జన్యుక్రమాన్ని విశ్లేషించి ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుందని.. వివాహం చేసుకోవాలనుకున్నవారు సంప్రదించినప్పుడు ఇద్దరిలోనూ వ్యాధికారకమార్పులు ఉన్నాయా లేదా అని గుర్తిస్తుందన్నారు. దక్షిణాసియా ప్రాంత ప్రజల కూ ఇలాంటి సౌకర్యం అందు బాటులోకి వస్తే తర్వాతి తరాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు.
మరిన్ని వార్తలు