నిన్ను కొడుకు లెక్కచూసుకున్నం బిడ్డా..

12 Sep, 2015 02:16 IST|Sakshi
నిన్ను కొడుకు లెక్కచూసుకున్నం బిడ్డా..

డాక్టర్ అయి ఆదుకుంటనంటివి
అప్పుడే మమ్మల్ని వదిలేసి పోయావా..
తల్లి మందలించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు

 
జవహర్‌నగర్: ‘నిన్ను కొడుకు లెక్క చూసుకున్నం బిడ్డా.. డాక్టరై మమ్మల్ని ఆదుకుంటనంటివి.. అంతలోనే ఎంతపనిచేస్తివి.. బిడ్డా.. మమ్మల్ని వదిలిపెట్టి పోతివా తల్లీ..’ అంటూ ఆ తల్లి గుండెలుబాదుకుంటూ రోదించింది. తల్లి మందలించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి న ఘటన శుక్రవారం జవహర్‌నగర్‌లోని బీజే ఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..  నిజామాబాద్ జిల్లాకు చెందిన యాడారం గ్రామానికి చెందిన శ్రీనివాసచారి, శోభారాణి దంపతులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం జవహర్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌కు వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె నవ్య(17) ఈసీఐఎల్‌లోని చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. శ్రీనివాసచారి కార్పెంటర్ పని చేస్తూ భార్యాపిల్లలను పోషించుకునేవాడు. చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉండే నవ్య డాక్టర్ కావాలన్న లక్ష్యంతో కష్టపడేది. ఈనేపథ్యంలో గురువారం ఉదయం టిఫిన్ విషయంలో శోభారాణి నవ్యను మందలించడంతో ఆమె మనస్తాపానికిలోనైంది. 

కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన నవ్య సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం మల్కాజిగిరి రైల్వేస్టేషన్ పరిధిలో పట్టాలపై నవ్య మృతదేహం ఉన్నట్లు రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా తల్లిదండ్రులు బోరున విలపించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
 
 

>
మరిన్ని వార్తలు