క్షణం ఆలస్యం చేయొద్దు!

9 Mar, 2015 03:15 IST|Sakshi
క్షణం ఆలస్యం చేయొద్దు!

గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
విద్యార్థులకు అధికారుల సలహా
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
జంట జిల్లాల్లో హాజరుకానున్న 3.50 లక్షల మంది విద్యార్థులు
హైదరాబాద్ జిల్లాలో 1,51,073 మంది,
రంగారెడ్డి జిల్లాలో 1,99,275 మంది
417 పరీక్ష కేంద్రాలు.. 144 సెక్షన్ అమలు
ప్రత్యేక బస్సులు.. ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో: క్షణం ఆలస్యం చేసినా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఇంటర్ విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు. జంట జిల్లాల్లో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సోమవారం ప్రథమ సంవత్సరం, మంగళవారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదలుకానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి వార్షిక పరీక్షలు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా, విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్లలో తప్పులు ఇప్పటికే సరిదిద్దామని జంట నగరాల ఆర్‌ఐఓ రవికుమార్ తెలిపారు. అంతేగాక హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలకు ెహ చ్చరిక పంపామన్నారు.
 
జంట జిల్లాల నుంచి 3.50 లక్షల మంది..
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 3,50,348 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులూ ఉన్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం 417 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 188 కేంద్రాల్లో 1,51,073 మంది, రంగారెడ్డి జిల్లాలో 229 కేంద్రాల్లో 1,99,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన విధించారు. కేంద్రాల పరిధిలో ఎటువంటి జిరాక్స్ సెంటర్లు తెరిచినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
 
గంట ముందే చేరుకోండి...
ఇంటర్ పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. నిర్దేశిత సమయం కంటే గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అరగంట ముందే కేటాయించిన గదిలో కూర్చోవాలి. ప్రత్యేక కారణాలుంటే తప్ప.. ఆ తర్వాత అనుమతించరు. ఎందుకు ఆలస్యమైంది, విద్యార్థి పేరు, హాల్ టికెట్ నంబర్, ఏ కాలేజీ తదితర వివరాలను ఇంటర్ బోర్డుకు నివేదిస్తారు. సదరు విద్యార్థి తర్వాత జరిగే పరీక్షలకు కూడా మరోమారు ఆలస్యంగా వస్తే హాలులోకి అనుమతించరు.
 
ప్రత్యేక  బస్సులు
సకాలంలో విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేలా రవాణా సదుపాయాలు కల్పించనున్నారు. గుర్తించిన రూట్లలో అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు జంట జిల్లాల కలెక్టర్లు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
 
సిబ్బంది నియామకం ఇలా...
ప్రతి సెంటర్‌కు ఒక చీఫ్ సూపరిటెండెంట్ (సీఎస్), ఒక డిపార్టుమెంట్ అధికారి(డీఓ)ని నియమించారు. వీరికి సహాయంగా అదనపు సీఎస్‌లను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు చొప్పున ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగనున్నాయి. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు కలెక్టర్ల ఆధ్వర్యలోని హైపర్ కమిటీ, ఇంటర్ బోర్డ్ రాజధానిలోనే ఉంది. ఆ అధికారుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున ఇన్విజిలేటర్లను నియమించారు.
 
ప్రథమ చికిత్స కేంద్రాలు
ఎండలు రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అందుకు సంబంధించిన మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తదితర సామగ్రిని సిద్ధం చేశారు. చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందికి విధులు కేటాయించారు. రంగారెడ్డి జిల్లాలో అంధులకు, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పరీక్ష రాయలేని విద్యార్థులకు స్క్రైబ్స్ (సహాయకులు)ను అధికారులు కేటాయించారు. ఇలా 50 మంది విద్యార్థుల వరకు స్క్రైబ్స్ సహకారంతో పరీక్షలకు హాజరు కానున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్‌ఐఓ గౌరీ శంకర్ తెలిపారు. హైదరాబాద్‌లో వీరిసంఖ్య 20 వరకు ఉంది. సాధారణ విద్యార్థులకంటే వీరు 30 నిమిషాల సమయాన్ని అదనంగా వినియోగించుకునే వెసులుబాటుంది.

మరిన్ని వార్తలు