ఇంటీరియర్ మోసాలు

7 Mar, 2016 00:20 IST|Sakshi
ఇంటీరియర్ మోసాలు

నగరవాసులను నిండాముంచుతున్న
కెనడీ జోసెఫ్, కంతేటి అరుణ
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
బాధితులు పదుల సంఖ్యలోనే.. ?

 
సిటీబ్యూరో: మోసాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. సైబర్, లాటరీ, లక్కీ స్కీమ్, చిట్‌ఫండ్ ఇలా ఎన్నో మోసాలను మనం చూసి ఉంటాం. ఇప్పుడు ఇంటి నిర్మాణం విషయంలో యజమానులకు ఉండే కోర్కెలను ‘క్యాష్’  చేసుకునే ముఠాలు పుట్టుకొచ్చాయి. ఇంటీరియర్ డిజైన్ పేరిట లక్షల్లో కుచ్చుటోపీ పెడుతున్న ఓ జంట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నై వాసి కెనడీ జోసెఫ్, హైదరాబాద్‌కు చెందిన కంతేటి అరుణ కలిసి కొత్తగా భవనాలు, ఫ్లాట్లు నిర్మించేవారిని సంప్రదించి అంతర్జాతీయ స్థాయి హంగులతో ఇంటీరియర్ డిజైన్ చేస్తామని నమ్మబలికి లక్షల్లో మోసం చేస్తున్నారని అత్తాపూర్‌కు చెందిన నాగమణి అనే బాధితురాలు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 155 వద్ద ఉన్న తమ ఫ్లాట్‌కు ఇంటీరియర్ డిజైన్ చేస్తామని రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందులో రూ. 5.75 లక్షలు  చెల్లించే వరకు తమపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ తర్వాత పనులు మొదలెట్టలేదని బాధితురాలు వాపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మరో 15 రోజుల్లో పని ప్రారంభిస్తామని చెప్తూ దాదాపు రెండేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఇదే విధంగా మోసపోయిన బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం.
 
ఇద్దరిదీ ప్రధాన పాత్రే...
రఫెల్ కెనడీ చదివింది పది వరకు మాత్రమే. అయితే మాసబ్‌ట్యాంక్ జేఎన్‌టీయూ అర్కిటెక్చర్ కాలేజీలో బీఆర్క్ చేశానని చెప్తాడు. అలాగే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్‌లో ట్రేడ్ లెసైన్స్ ఉన్నట్టు నమ్మిస్తాడు. హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన కంతేటి అరుణ తన పీఏగా చెప్పుకుంటూ బాధితులను ఆమె ద్వారా తమ ఉచ్చులో పడేలా చేస్తాడు.  గూగుల్‌లోని డిజైన్లను డౌన్‌లోడ్ చేసి, వాటిని తామే చేశామని నమ్మిస్తారు. డబ్బులు వచ్చేదాకా అరుణను ముందుం డి నడిపిస్తాడు. దాదాపు 60 శాతం డబ్బు వసూలు చేసి తర్వాత తన నిజస్వరూపం బయటపెడతాడు. తాను బెంగళూరు, ముంబై, లక్షద్వీప్‌లలో బిజీ గా ఉన్నానని కొందరు బాధితులకు, సినిమా తారలను కలిసేందుకు ముంబైకి వచ్చానని మరికొందరికి కల్లబొల్లి కబుర్లు చెబుతాడు. ఇలా ఏళ్లు గడిచినా ఇంటీరియల్ డిజైన్ పని మాత్రం పూర్తి చేయడు. బాధితులు గట్టిగా నిలదీస్తే తన కార్యాలయాన్ని మార్చేస్తాడు. తొలినాళ్లలో మారేడ్‌పల్లి, నారాయణగూడలో ఆర్‌కే అసోసియేట్స్ పేరిట మోసం చేసిన జోసెఫ్, అరుణ జంట...ఆ తర్వాత బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న రిలయన్స్ మానర్‌లో తన కుటుంబం ఉంటున్న ఫ్లాట్‌లోనే రాఫెల్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని నడుపుతూ మోసాలకు తెరలేపాడు. మంత్రి కడియం శ్రీహరికి తాను దగ్గర వాడినని, అందుకే ఆయన కూతురు ఫ్లాట్‌లో ఉన్నానని, వారి ఇళ్లకు కూడా ఇంటీరియర్ డిజైన్ చేసింది తానేనని నమ్మిస్తాడు.  
 
మకాం గుంటూరుకు...
 కంతేటి అరుణ.. రఫెల్‌కు పీఏ కాదు... అతని రెండో భార్య. వీరిద్దరికీ ఒక బాబు ఉన్నాడు. దమ్మాయిగూడలో అరుణ అక్క పేరుతో కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో అమ్మమ్మ, తాతల వద్ద ఆ బాబు ఉంటున్నాడు. అయితే అరుణ, రఫెల్‌ల మోసాలు పోలీసులకు తెలియడంతో సిటీ నుంచి తమ మకాంను గుంటూరులోని మాచవరానికి మార్చారు. రాజధాని అమరావతి నిర్మాణంతో అక్కడ ఇప్పుడు కొత్త భవనాలు నిర్మాణం పెద్ద ఎత్తును సాగుతుండటంతో అక్కడ ఇంటీరియల్ డిజైన్ పేరిట మోసాలకు తెరలేపేందుకు ఈ జంట వెళ్లిందని తెలుస్తోంది.
 
 

మరిన్ని వార్తలు