అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

17 Aug, 2016 18:16 IST|Sakshi

- సిటీకి గోవా నుంచి కొకైన్ డ్రగ్ సరఫరా
- రెండు ప్రాంతాల్లోని నైజీరియన్ల దందా
- అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు
- కొకైన్‌తో పాటు బ్రౌన్‌షుగర్ స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో

 గోవా కేంద్రంగా దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో మాదకద్రవ్యాల దందా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరి నుంచి 73 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల బ్రౌన్‌షుగర్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి పేర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్లు ఎల్.రాజా వెంకటరెడ్డి, పి.బల్వంతయ్యలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.


వస్త్రవ్యాపారం ముసుగులో...
నైజీరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రఫెల్, అనోరా, సొలోమెన్, పీటర్, సామ్సన్, చుకు, ప్రామిస్ 2012-2015 మధ్య బిజినెస్ వీసాతో భారత్‌కు వచ్చారు. కోయంబత్తూర్‌లో వస్త్రాలు ఖరీదు చేసి నైజీరియాకు ఎక్స్‌పోర్ట్ చేసే వ్యాపారులుగా స్థిరపడ్డారు. సొలోమెన్, చుకు, ప్రామిస్‌లు హైదరాబాద్‌లోని బండ్లగూడ, సైనిక్‌పురి, టోలిచౌకి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మిగిలిన నలుగురూ గోవాలో ఉంటున్నారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా కొకైన్‌ను సమీకరిస్తున్న రఫెల్ దీన్ని విక్రయించడం కోసం దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడికైనా డ్రగ్ సరఫరా చేయడానికి అనోరా, పీటర్‌లను వినియోగించుకునే వాడు. వీరిద్దరూ బస్సులు, రైళ్ళల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ ఇచ్చి వచ్చేవారు.


రూ.2.5 వేలకు ఖరీదు, రూ.5 వేలకు విక్రయం...
రఫెల్ ఈ మాదకద్రవ్యాన్ని గ్రాము రూ.2,500 నుంచి రూ.3 వేలకు ఖరీదు చేస్తున్నాడు. దీన్ని తన ఏజెంట్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపి గ్రాము రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముతున్నాడు. ఈ ఏజెంట్లు ఆయా నగరాల్లో తమకు కస్టమర్లుగా ఉన్న విద్యార్థులు, యువతకు భారీ మొత్తానికి విక్రయిస్తున్నారు. ప్రామిస్ అనే నైజీరియన్ జాన్ అనే మరో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొకైన్, బ్రౌన్‌షుగర్ ఖరీదు చేసి విక్రయిస్తున్నాడు. రఫెల్ అందరు నిందితులూ హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం అందుకున్న వెస్ట్, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుళ్ళు ముర్తుజా, మధు, సందీప్ అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో సీసీఎస్‌లోని నార్కొటిక్ సెల్ అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్నారు. బుధవారం ఏడుగురినీ అరెస్టు చేసి ‘సరుకు’, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.


వస్త్రాల రూపంలో స్వదేశానికి...
ఈ గ్యాంగ్ మాదకద్రవ్యాల దందాలో సంపాదించింది మొత్తం తన స్వదేశానికి వస్త్రాల రూపంలో పంపేస్తున్నారు. ప్రతి డీల్‌లోనూ వచ్చిన లాభాలతో కోయంబత్తూర్‌లో రెడీమేడ్, ఇతర వస్త్రాలు ఖరీదు చేస్తున్నారు. వీటిని నైజీరియాకు ఎక్స్‌పోర్ట్ చేస్తూ, తమ అనుచరులు ద్వారా అమ్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడుగరిలో అనేక మందిపై హైదరాబాద్‌తో పాటు గోవా, ముంబై తదితర నగరాల్లో కేసులున్నాయి. ఈ వివరాలన్నీ సేకరిస్తున్న పోలీసులు నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం యాంటీ నార్కొటిక్స్ సెల్‌కు అప్పగించారు.

మరిన్ని వార్తలు