రాస్తే పే రాణిగిరి

6 Mar, 2015 23:29 IST|Sakshi
రాస్తే పే రాణిగిరి

ఆమె అడుగు బయటపెడితే.. మగదొరలు అడ్డు తొలగి దారి వదలాలి. ఈవ్ టీజర్లు  అదృశ్యం కావాలి. చేయి ఎత్తితే ఆర్టీసీ బస్సు ఆగాలి. ఆటోవాలాలు వంకర మాటలు మానాలి. కాలిబాట ఆమెకు రాచబాటవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రహదారిపై ఆమె ‘రాణి’గిరి చేయాలి. ఇలా జరగాలంటే.. మహిళ కోసం ఒక రోజు కాదు ప్రతి రోజూ ప్రత్యేకించాల్సిందే.  ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాల్సిందే. ఇదే సందేశాన్ని మోసుకొస్తోంది ఈ వారం రాహ్‌గిరి.
 ఎస్.సత్యబాబు
 
 ‘రణగొణ ధ్వనుల నిలయమో, కాలుష్యపు విష వలయమో’ మాత్రమే కాదు రహదారి అంటే చక్కని విందు వినోదాల సందడికి వేదిక కూడా అని నిరూపిస్తోంది రాహ్‌గిరి. వినూత్న తరహాలో మొదలైన రాహ్‌గిరి వారాంతపు ‘వీధుల్ని’ సరికొత్తగా అలంకరిస్తున్న సంగతి తెల్సిందే. సైబరాబాద్‌లో ఒక సంప్రదాయంలా స్థిరపడుతున్న రాహ్‌గిరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆడతనాన్ని’ సింగారించుకుని మరింత కొత్తగా జరగనుంది.
 
 ఆకర్షణలెన్నో..
 ‘స్ట్రాంగ్ విమెన్-స్ట్రాంగ్ నేషన్’ పేరుతో టీఏఎఫ్ సైకిల్ రైడ్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్/ షి టీమ్స్ ఆధ్వర్యంలో ‘వాక్ ది టాక్’, మాస్టర్ చెఫ్ పునీత్ మెహతాతో ‘క్యాచ్ హిమ్ లైవ్’, మాన్సి, సిద్ధిల ఆధ్వర్యంలో పాట్ డెకరేషన్, లివ్ లైఫ్ ఫౌండేషన్ సారథ్యంలో ‘నుక్కడ్ నాటక్’, సుహానీ నిర్వహణలో క్రియేటివ్ రైటింగ్ వర్క్‌షాప్.. వంటి కార్యక్రమాలు హైలెట్స్‌గా నిలవనున్నాయి.
 
 
  అంతేకాకుండా చెరిషింగ్ విమెన్‌హుడ్ మరో ప్రత్యేక ఆకర్షణ. మదర్‌హుడ్ ఇండియా హాస్పిటల్ ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా విమెన్ సేఫ్టీ పెయింటింగ్ ఎక్స్‌పో నిర్వహిస్తోంది. దీనిలోనే లైవ్ పెయింటింగ్ కూడా ఉండడం విశేషం. వీటితో పాటు ప్రతి వారంలాగే గల్లీ ఫుట్‌బాల్, యోగా-జుంబా సెషన్స్, ఫ్యాషన్ రీల్స్ ఫొటోగ్రఫీ వర్క్‌షాప్, అసెండాస్ అందించే కైట్ ఫ్లైయింగ్, డి-కెమ్లెన్  స్కేటింగ్ వర్క్‌షాప్‌లు యధావిధిగా ఉంటాయి.
 
 
 సకుటుంబ సపరివార సమేతం..
 రహదారులు మహిళకు రాచబాటలు కావాలని, రక్షణ కవచాలవ్వాలని కోరుకునే వారెవరైనా ఆదివారం జరిగే ఈ ఈవెంట్‌లో పాల్గొనవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. మహిళల భద్రత అనేది స్లోగన్‌లా మిగలకూడదని ప్రతి ఒక్కరికీ కమిట్‌మెంట్ కావాలనే సందేశంతో దీనిని నిర్వహిస్తున్నామంటున్నారు. మహిళాదినోత్సవం నేపథ్యంలో ఈ రాహ్‌గిరి మహిళలకు ప్రత్యేకమైనా.. కుటుంబ సమేతంగా కూడా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
 
 వేదిక..
 గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్క్ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్ దాకా ఈ రాహ్‌గిరి నిర్వహిస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, నాస్‌కామ్, హైసీ, టై, టీఎస్‌ఐఐసీ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఎంబార్క్ ఇండియాల సంయుక్త నిర్వహణలో ఇది జరుగనుంది. వంటింటికి పరిమితం కాకుండా ప్రపంచాన్నే తన ఇంటిగా మార్చుకునే దిశగా వనితల ప్రయాణానికి అడ్డంకులు తొలగిద్దాం. ఆమె గెలుపు అందరి గెలుపనే జ్ఞాన దీపాల్ని నలుదిశలా వెలిగిద్దాం.
 
 భద్రత  ప్రధాన హక్కు..
 మునుపెన్నడూ లేని విధంగా మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాజ అభివృద్ధిలో విభిన్న రకాలుగా భాగస్వాములవుతున్నారు. ఇలాంటి సమయంలో అన్నింటికన్నా మహిళల భధ్రత అత్యంత ప్రధానమైన అంశంగా మారింది. భద్రత తమ హక్కు అని నినదిస్తున్న భారతీయ మహిళ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలి. రాహ్‌గిరి ఈ విషయంలో తన చిత్తశుద్ధిని ప్రదర్శించనుంది.
 - విశాలరెడ్డి, నిర్వాహక సంస్థ ప్రతినిధి
 

మరిన్ని వార్తలు