అంతరాష్ట్ర ముఠా అరెస్టు

24 Aug, 2013 01:38 IST|Sakshi
అంతరాష్ట్ర ముఠా అరెస్టు

సాక్షి,సిటీబ్యూరో: మనదేశంలో నిషేధంలో ఉన్న బ్రెజిల్ కరెన్సీని గుట్టుచప్పుడు కాకుండా మార్పిడి చేయడమే కాకుండా ఒక బ్రెజిల్ నోటుకు సరిపడా రూపాయలు ఇస్తే.. మరో బ్రెజిల్ నోటును ఉచితంగా ఇస్తామని అమాయకులను మోసగిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి బ్రెజిల్ దేశపు కరెన్సీ రియాల్స్ 1,62,450ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి పరారీలో ఉండగా నలుగురు సభ్యులు పట్టుబడ్డారు.

ఎస్‌వోటీ ఓఎస్‌డీ కసిరెడ్డి గోవర్దన్‌రెడ్డి శుక్రవారం దీనికి సంబంధించి వివరాలను మీడియాకు వెల్లడించారు. కేరళకు చెందిన కరీం (40), ప్రేమచంద్ర (35),హనీఫ్ (30)లు స్నేహితులు. ప్రేమచంద్ర స్నేహితుడు పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన సివిల్ ఇంజనీర్ బాలాజీరెడ్డి (52), ఇతని స్నేహితుడైన కాకినాడకు చెందిన కంప్యూటర్లు విక్రయించే చంపాటి కృష్ణంరాజు (24)లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి కరీం. మనదేశంలో నిషేధితమైన బ్రెజిల్ కరెన్సీని ఇక్కడ మార్పిడి చేసేందుకు ఈఐదుగురు పథకం వేశారు.

బ్రెజిల్‌కు చెందిన ఒక నోటు (రియాల్స్)కు విలువచేసే (మారక ధర) ఇండియన్ రూపాయినోట్లు ఇస్తే మరో బ్రెజిల్ నోటు ఉచితంగా ఇస్తామని పలువురు అమాయకులను వలలో వేసుకున్నారు. అత్యాశకు పోయిన కొందరు వీరినుంచి బ్రెజిల్ నోట్లను తీసుకున్నారు. ఇలా ఈ ముఠా బ్రెజిల్ నోట్లను మార్పిడి చేసేందుకు సరూర్‌నగర్‌లోని శాంత రెసిడెన్సీ హోటల్‌కు చేరుకుంది.

విశ్వసనీయ సమాచారమందుకున్న సైబరాబాద్ పోలీ సు కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్‌వోటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు కుశాల్కర్, కె.చంద్రశేఖర్‌లు హోటల్‌పై దాడిచేసి ప్రేమచంద్ర, హనీఫ్, బాలాజీ రెడ్డి, కృష్ణంరాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి బ్రెజిల్ కరెన్సీని స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను సరూర్‌నగర్ పోలీ సులకు అప్పగించారు. ప్రధానసూత్రధారి కరీం పట్టుబడితే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని గోవర్దన్‌రెడ్డి చెప్పారు.
 

మరిన్ని వార్తలు