సీబీఐతో విచారణ చేయించాలి

10 Jun, 2017 02:19 IST|Sakshi
సీబీఐతో విచారణ చేయించాలి
నీళ్ల లీకేజీ ఘటనలో స్పీకర్‌ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఆర్కే
 
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ లీకేజీ ఘటనను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. వర్షం పడిన రోజు అసెంబ్లీలోకి మీడియాను అనుమతించాలని ఎంత ప్రాధేయపడ్డా పట్టించుకోని స్పీకర్‌.. రెండ్రోజుల తర్వాత అసెంబ్లీని సుందరంగా తీర్చిదిద్ది అందరినీ అనుమతిస్తున్నామని చెప్పడంపై మండిపడ్డారు. గొట్టాలు కోసిన ప్రాంతానికి మీడియాను తీసుకెళ్లి సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని స్పీకర్‌ చెప్పడాన్ని తప్పుబట్టిన ఆర్కే.. గొట్టాల మీద కాదు సీఐడీ విచారణ.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న గొట్టంగాళ్ల అవినీతిని బయటకు తీసేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

వర్షం కురిసిన రోజే అసెంబ్లీలోని తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌కి వెళ్లానని, ఊడిన సీలింగ్‌ను, నీటితో మునిగినట్లు ఉన్న చాంబర్‌ను చూసి ఆశ్చర్యమేసిందని ఆర్కే చెప్పారు. ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో పాటు మీడియాను లోపలికి అనుమతించి ఉంటే అంతా చూపించేవాళ్లమన్నారు. స్పీకర్‌ కోడెల మీడియాను నేరుగా పైపులకు దగ్గరకు కాకుండా ప్రతిపక్ష నేత చాంబర్‌ వద్దకు.. అదే విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్‌ చాంబర్లకు తీసుకెళ్లి ఉంటే పరిస్థితి తెలిసేదన్నారు. అప్పుడు స్పీకర్‌ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు