జీవజాతులపై పరిశోధనలు అవసరం

28 Jan, 2018 03:13 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న మార్టిన్‌

 నోబెల్‌ గ్రహీత మార్టిన్‌ షాలిఫీ  

 కణజీవశాస్త్రంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: జీవశాస్త్రవేత్తల ప్రయోగాలు ఎలుకలు, బొద్దింకలు, ఈగలు వంటి నమూనా జంతువులకే పరిమితం చేయకుండా అన్ని రకాల జీవజాతులపై పరిశోధనలు జరపాలని నోబెల్‌ గ్రహీత మార్టిన్‌ షాలిఫీ సూచించారు. ఆవిష్కరణలు, పరిశోధనలు ఒక్కరివల్ల అయ్యేవి కావని, ఆయా రంగాల్లో కృషి చేస్తున్న ఇతర శాస్త్రవేత్తల సహకారం కూడా అవసరమని తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న ‘కణజీవశాస్త్ర అంతర్జాతీయ సదస్సు’కు ఆయన హాజరై మాట్లాడారు. గ్రీన్‌ ఫ్లోరోసెంట్‌ ప్రొటీన్‌ ఆవిష్కరణ ద్వారా జీవిలో చూడలేని జన్యుపరమైన చర్యలను ప్రత్యక్షంగా చూసేలా చేశామన్నారు. జన్యుశాస్త్రంలో మౌలిక పరిశోధనలు వేగం పుంజుకునేందుకు, హెచ్‌ఐవీ పరిశోధనల్లోనూ ఈ ఆవిష్కరణ కీలకంగా మారిందని చెప్పారు. వీటితోపాటు మందుపాతరల గుర్తింపునకు, చీకట్లో వెలుగులు చిమ్మే పట్టుతయారీకి పనికొచ్చిందని తెలిపారు. గొప్ప ఆవిష్కరణల్లో చాలావరకూ యాదృచ్ఛికంగా జరిగినవేనన్నారు.  

ఘనంగా ప్రారంభమైన ఐసీసీబీ 
కణజీవశాస్త్రంలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపైకి చేర్చే లక్ష్యంగా తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆన్‌ సెల్‌ బయాలజీ–2018 శనివారం ఘనంగా ప్రారంభమైంది. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ఆసియా పసిఫిక్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ సెల్‌ బయాలజిస్ట్, ఇండియన్‌ సొసైటీ ఫర్‌ సెల్‌ బయాలజిస్ట్‌ వంటి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1200 మంది జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ సహాయ మంత్రి వై.ఎస్‌.చౌదరి ఆదివారం హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు