‘స్విస్ చాలెంజ్’ కేసును 26న విచారిస్తాం

22 Oct, 2016 02:16 IST|Sakshi
‘స్విస్ చాలెంజ్’ కేసును 26న విచారిస్తాం

- తమ అప్పీళ్ల గురించి ప్రస్తావించిన ఏజీకి హైకోర్టు స్పష్టీకరణ
- బెంచ్‌లు మారిన నేపథ్యంలో విచారణకు నోచుకోని అప్పీళ్లు
 
 సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ కేసుపై ఈ నెల 26న విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో బెంచ్‌లు మారిన నేపథ్యంలో స్విస్ కేసు విచారణకు నోచుకోని నేపథ్యంలో దీనిగురించి అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై తాము దాఖలు చేసిన అప్పీళ్లను విచారించాలని సీఆర్‌డీఏ, పురపాలకశాఖల తరఫున ఏజీ కోరారు. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఈ నెల 26న విచారణ చేపడతామంది. దీనికి పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన వేదుల వెంకటరమణ సైతం తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్విస్ చాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడి హోదాలో రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వీటికి పోటీ ప్రతిపాదనల్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్, తరువాత ఇచ్చిన సవరణ నోటిఫికేషన్‌లను సవాలుచేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య, చెన్నైకు చెందిన ఎన్వియన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ నోటిఫికేషన్ అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాలుచేస్తూ సీఆర్‌డీఏ, పురపాలకశాఖలు ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై పలు దఫాలుగా ధర్మాసనం విచారణ చేపట్టింది.

>
మరిన్ని వార్తలు