సాహిత్యోత్సవం.. అందరికీ ఆహ్వానం

10 Jan, 2018 01:38 IST|Sakshi
మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం

     కుటుంబ ఉత్సవంలా హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌

     హెచ్‌ఎల్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడి

     26 నుంచి ఉత్సవాలు.. బేగంపేట్‌ పబ్లిక్‌ స్కూల్‌ వేదిక

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నామని, ఇందులో వివిధ అంశాలపై వందకుపైగా ప్రసంగాలు, చర్చలు, ఇష్టాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామని హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ (హెచ్‌ఎల్‌ఎఫ్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ వేదికగా జరగనున్న ఈ వేడుకల్లో సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, కళారంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొననున్నట్లు వివరించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిటరరీ ఫెస్టివల్‌కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వేడుకల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా సాహిత్యోత్సవం
హైదరాబాద్‌ సాహిత్యోత్సవానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని, రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తోందని విజయ్‌కుమార్‌ తెలిపారు. కవులు, రచయితలతో ప్రారంభమై ప్రస్తుతం ఇతర అనేక కళారూపాలకు కూడా విస్తరించిందన్నారు. అలాగే హైదరాబాద్‌ గొప్పతనాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు వేడుకలు దోహదం చేస్తాయన్నారు. సమావేశంలో హెచ్‌ఎల్‌ఎఫ్‌ ప్రతినిధులు అజయ్‌ గాంధీ, అమితాదేశాయ్, కిన్నెర మూర్తి పాల్గొన్నారు.

ఇది ఎనిమిదో వేడుక..
నగరానికి చెందిన కొందరు సాహితీ ప్రియులు 2005లో ‘మ్యూస్‌ ఇండియా’పేరుతో ఒక వెబ్‌ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. భారత సాహిత్యాన్ని పాఠకులకు పరిచయం చేసే లక్ష్యంతో మొదలైన ఈ మ్యాగజైన్‌ ఆ తర్వాత ఒక అంతర్జాతీయ సాహిత్య వేదికగా ఆవిర్భవించింది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కవులు, రచయితలు, కళాకారులు, విమర్శకులు, ఔత్సాహికులు, పాఠకులు అందరినీ ఒక వేదికపైకి తెచ్చిన వేడుకే ‘హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌’. జర్మనీ సెంటర్‌ నిర్వాహకులు అమితాదే శాయ్, ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ నిపుణులు జీఎస్‌పీ రావు, ఉస్మానియా వర్సిటీ ఇంగ్లీష్‌ విభాగం ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు 2010లో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. కొద్దిమంది సాహితీవేత్తలతో ప్రారంభమైన ఈ లిటరరీ ఫెస్టివల్‌ ఇప్పుడు 8వ ఎడిషన్‌కు చేరుకుంది. ఈ ఏడాది అతిథి దేశంగా స్పెయిన్‌ హాజరుకానుంది. 

>
మరిన్ని వార్తలు