ఆమె ఆలోచన... ఓ స్కిన్‌ బ్యాంక్‌!

3 Apr, 2017 02:38 IST|Sakshi
ఆమె ఆలోచన... ఓ స్కిన్‌ బ్యాంక్‌!

►వినూత్న రీతిలో నగర ఐపీఎస్‌ సుమతి ప్రయత్నం
►ఆరోగ్య శాఖకు సూచించిన అధికారిణి
►సాధ్యాసాధ్యాలపై జోరుగా అధ్యయనం


 సిటీబ్యూరో: నార్త్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్‌ అధికారిణి బి.సుమతి 2016 జూన్‌లో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ప్రత్యేకించి బర్న్స్‌ వార్డ్‌కు వెళ్లారు. అది కేవలం సాధారణ పర్యటనే అని అందరూ అనుకున్నారు. దాని వెనుక ఓ వినూత్న ఆలోచన ఉందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేవలం కొన్ని మెట్రో నగరాలకే పరిమితమైన స్కిన్‌ బ్యాంక్‌ను సిటీలోనూ ఏర్పాటు చేయించాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా కాకపోయినా... అనధికారికంగా ఆరోగ్య శాఖకు ఈ కీలక సలహా ఇచ్చారు సుమతి. దీంతో అధికార యంత్రాంగాలు ఈ స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై జోరుగా అధ్యయనాలు చేస్తున్నాయి. తన సర్వీసులో తాను చూసిన ఎన్నో కాలిన కేసుల నేపథ్యంలోనే తనకీ ఆలోచన వచ్చిందని సుమతి చెబుతున్నారు.

మరణాల్లో అత్యధికం ఇన్‌ఫెక్షన్‌తోనే...
ప్రమాదాలు, ఆత్మహత్యయత్నాల్లో శరీరంపై కాలిన గాయాలైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. క్షణాల నుంచి నెలల్లోపు ఎప్పుడైనా ఈ క్షతగాత్రుల్ని మృత్యువు కబళించే ఆస్కారం ఉంటుంది. కాలిన గాయాలైన  సందర్భాల్లో అనేక మంది మరణించడానికి ప్రధాన కారణం తదనంతర ఇన్‌ఫెక్షన్స్‌. కాలినప్పుడు ఆయా ప్రాంతాల్లో శరీరంపై ఉండే చర్మం పూర్తిగా దెబ్బతింటుంది. అక్కడి టిష్యూస్‌ సైతం చనిపోవడంతో తిరిగి కొత్త చర్మం వచ్చే ఆస్కారం లేదు. దీంతో అనేక రకాలైన ఇన్‌ఫెక్షన్స్‌ సోకి బాధితులు చనిపోతుంటారు. పదిహేనేళ్లకు పైగా పోలీసు విభాగంలో పనిచేసిన సుమతి తన సర్వీసులో అనేక కాలిన కేసుల్ని చూశారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కొలుకున్నట్లే భావించినా హఠాత్తుగా కన్నుమూసిన ఘటనలు ఎన్నో చూశారు. ఆయా సందర్భాల్లో వైద్యులతో సంప్రదింపులు జరిపిన సుమతి ఇన్‌ఫెక్షన్స్‌ కారణంగానే మరణం సంభవించినట్లు తెలుసుకున్నారు. ఆ సమయంలో స్కిన్‌ బ్యాంక్‌ గురించి ఆలోచించారు.

సుదీర్ఘ పరిశీలన తర్వాత...
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సుమతి అనేక కేసులతో పాటు ఇంటర్‌నెట్‌లోనూ సుదీర్ఘ పరిశీలన చేశారు. అమెరికా, యూరవ్‌ వంటి చోట్ల ప్రాచుర్యం, ప్రజాదరణ పొందిన స్కిన్‌ బ్యాంక్స్‌ పనితీరును గమనించారు. ఈ అనుభవాలకు తోడు నార్త్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీ ఆస్పత్రి బర్న్స్‌ వార్డ్‌ సందర్శన ఆమెను కదిలించాయి. వెంటనే స్కిన్‌ బ్యాంక్‌ అంశాన్ని పరి«శీలించాల్సిందిగా సంబంధిత విభాగాలకు అనధికారికంగా సూచించారు. దీనిపై స్పందించిన ఉన్నత స్థాయి అధికారులు వైద్య ఆరోగ్య శాఖతో పాటు బర్న్స్‌ వార్డ్‌ ఉన్న ఆస్పత్రుల్లో పని చేసే, ఆ రంగంలో విశేష అనుభవం కలిగిన వైద్యులతో లోతైన అధ్యయనం చేయిస్తున్నారు. ఈ బ్యాంక్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, వ్యయం, లాభనష్టాలపై పలువురి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఈ స్కిన్‌ బ్యాంక్స్‌ నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని నిపుణులు చెప్తున్నారు. దేశంలోనూ ఢిల్లీ, ఫుణే, ఇండోర్, ముంబై, నవీ ముంబై, బెంగళూరుల్లో స్కిన్‌ బ్యాంక్స్‌ పని చేస్తున్నాయి.

స్కిన్‌... డోనర్‌ టు రిసీవర్‌
►కళ్లు తదితర అవయవాల మాదిరిగానే చర్మాన్ని సైతం మనిషి చనిపోయిన తర్వాత
►అతడి కుటుంబం అనుమతితో సేకరిస్తారు.
►మరణం సంభవించిన తర్వాత గరిష్టంగా ఆరు గంటల్లోపు చర్మాన్ని సేకరించాల్సి ఉంటుంది.
►కేవలం 18 ఏళ్లకు మించిన వాళ్ల శరీరం నుంచే చర్మాన్ని సేకరిస్తారు. ఈ ప్రక్రియ 30 నుంచి 40 నిమిషాల్లోనే పూర్తవుతుంది.
►స్కిన్‌ బ్యాంక్‌నకు చెందిన వారే మృతుడి ఇల్లు, ఆస్పత్రి, మార్చురీలకు వస్తారు.
►కేవలం తొడ భాగం నుంచే చర్మాన్ని సేకరిస్తారు.
►ఇలా సేకరించిన చర్మాన్ని స్కిన్‌ బ్యాంక్‌లో నిర్ణీత టెంపరేచర్, జాగ్రత్తల మధ్య రెండు నుంచి ఐదేళ్ల పాటు భద్రపరిచే అవకాశం ఉంది.
►హెచ్‌ఐవీ, హెపిటైటిస్, స్కిన్‌ క్యాన్సర్, చర్మ వ్యాధులు, సుఖ వ్యాధులు ఉన్న వారి చర్మం
    సేకరణకు పనికి రాదు.
►చర్మం విషయంలో దాత, గ్రహీతల రక్తం గ్రూపు కలవాల్సిన పనిలేదు. ఇలా రిసీవర్‌కు ఏర్పాటు చేసిన చర్మం నాలుగు వారాల పాటు రక్షణ కల్పించి ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా చేస్తుంది.

మరిన్ని వార్తలు