‘ఎనీవేర్‌’ మూల్యం వెయ్యి కోట్లపైనే

12 Jun, 2017 03:28 IST|Sakshi
‘ఎనీవేర్‌’ మూల్యం వెయ్యి కోట్లపైనే
సర్కారు ఆదాయానికి భారీగా గండి
- రాజధాని శివారుల్లో పెద్దఎత్తున అక్రమాలు
చక్రం తిప్పిన సబ్‌రిజిస్ట్రార్లు
వ్యవసాయేతర భూములు వ్యవసాయ భూములుగా నమోదు
- ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బాగోతాలు
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎనీవేర్‌ దందా ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టడమే కాకుండా సర్కారు ఖజానాకు కూడా భారీగా గండి కొట్టింది. నాలుగేళ్లలో వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాగా.. సబ్‌ రిజిస్ట్రార్లు నిర్దేశిత విలువను తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీశారు. సాక్షాత్తు రాష్ట రాజధాని పరిధిలోనే సుమారు రూ.1000 కోట్లకుపైగా ఆదాయానికి నష్టం వాటిల్లగా, అందులో సుమారు 20 శాతం వరకు అక్రమార్కుల జేబుల్లో పడినట్లు తెలుస్తోంది. సబ్‌రిజిస్ట్రార్లు భూములు, స్థలాలు, మార్కెట్‌ విలువ తగ్గించడం, డాక్యుమెంట్ల వర్గీకరణలో మార్పులు, పాస్‌బుక్‌ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం, నిర్మాణాలు ఉన్నా లేనట్లుగా పేర్కొనడంతో భారీగా స్టాంప్‌ డ్యూటీ నష్టపోవాల్సి వచ్చింది.

హైదరాబాద్‌ శివారులోని కూకట్‌పల్లి, బాలానగర్, ఎల్బీనగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, గండిపేట, శేరిలింగంపల్లి తదితర సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వందల ఎకరాల వ్యవసాయేతర భూములను వ్యవసాయ భూములుగా పేర్కొంటూ ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం నగర శివారులోని కొన్ని నగర పంచాయతీలు, పంచాయతీ పరిధిల్లోని  వ్యవసాయ భూములను ప్రభుత్వం వ్యవసాయేతర భూములుగా గుర్తించింది. ఫలితంగా ఐటీ కారిడార్‌ పారిశ్రామిక వాడల్లోని గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లలోని వందల ఎకరాల భూములు వ్యవసాయేతర భూములుగా మారాయి. కానీ సబ్‌ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర భూములను కూడా వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.
 
మచ్చుకు కొన్ని..
► హైదరాబాద్‌ నగర శివారులోని రాజేంద్రనగర్‌ మండలం ఖానాపూర్‌లో గండిపేటశంకర్‌పల్లి రోడ్డు చెంత భూమి ఔటర్‌ రింగ్‌రోడ్‌కు సమీపంలో ఉండటంతో వ్యవసాయేతర భూమిగా నిర్ధారించారు. దీన్ని సబ్‌ రిజిస్ట్రార్లు వ్యవసాయ భూమిగా పేర్కొని అక్రమాలకు పాల్పడ్డారు. సర్వే నంబర్‌ 65/4లో 8 ఎకరాలు, 65/5లో 10 ఎకరాలు, 65/6లో  10 ఎకరాలు వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్‌ చేసి స్టాంప్‌ డ్యూటీ కింద 3.42 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు తెలుసోంది. వాస్తవంగా నివాసయోగ్యమైన ఆ భూమి గజం ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా ఉంటుంది. రూ.3 వేల చొప్పున లెక్కిస్తే సగటున ఎకరం ధర రూ.1.44 కోట్ల వరకు ఉంటుంది.  దానికి ఆరు శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు లెక్కిస్తే రూ.8.44 లక్షల దాకా అవుతుంది. ఈ లెక్కన మొత్తం 28 ఎకరాలకు సగటున రూ.2.36 కోట్ల వరకు స్టాంప్‌ డ్యూటీ రాబట్టాల్సి ఉండగా.. కేవలం రూ.3.42 లక్షలతో సరిపుచ్చారు.
► శంషాబాద్‌లో సర్వే నంబర్‌ 745లో 11.36 ఎకరాల భూమిని ప్లాటింగ్‌ చేశారు. 103 మందికి రిజిస్ట్రేషన్‌ చేశారు. అదే భూమి కొన్నేళ్ల తర్వాత వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున స్టాంప్‌ డ్యూటీకి గండి పడింది.
 
ఎనీవేర్‌లో 80 % అక్రమాలే..
ఎనీవేర్‌ కింద నమోదైన దస్తావేజుల్లో సుమారు 80 శాతం వరకు ఏదో రకంగా అక్రమాలు జరిగి ఉండవచ్చని సంబంధిత అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల వరకు దస్తావేజులు నమోదు కాగా.. అందులో ఎనీవేర్‌ కింద నాలుగున్నర లక్షల వరకు నమోదైనట్లు తెలుస్తోంది. అందులో నగర పరిధిలోనే మొత్తం 13.26 లక్షల దస్తావేజులకుగాను ఎనీవేర్‌ కింద 2.41 లక్షలు నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని వార్తలు