ఆప్కోలో అవకతవకలు వాస్తవమే

17 May, 2016 03:37 IST|Sakshi

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విచారణ కమిటీ
 
 సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక చేనేత సొసైటీల ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా ఆప్కో (టీఎస్) ఇష్టారీతిన వస్త్రాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం విచారణలో తేలింది.  క్షేత్ర స్థాయి అవసరాలతో పొంతన లేకుండా ఇండెంట్ ఆర్డర్లు.. మగ్గాలు లేని సొసైటీలు వస్త్రాన్ని సరఫరా చేయడం.. చేనేత పేరిట పవర్‌లూమ్ ఉత్పత్తులను అంటగట్టడం వంటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగించిన వైనం విచారణలో వెల్లడైంది. రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో టీఎస్)లో జరిగిన అవకతవకలపై చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన త్రిసభ్య విచారణ కమిటీ.. ఇటీవల తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

అనేక అంశాలపై ఆప్కో (టీఎస్) నుంచి అరకొర సమాచారం అందినట్లు నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, ఆప్కో విక్రయ షోరూంల నుంచి అందే ఇండెంట్ల ఆధారంగా సొసైటీలకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇవ్వాల్సి ఉన్నా.. అధికారులు నిబంధనలు ఉల్లంఘించి నట్లు నివేదికలో పేర్కొంది. వస్త్రం నాణ్యత, సొసైటీల ఉత్పత్తి సామర్థ్యం తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సిబ్బంది స్టాంపింగ్ వేశారు. ఆప్కో గోదాముల్లోనూ వస్త్ర నిల్వలకు సంబంధించి గేట్ ఎంట్రీలు శాస్త్రీయంగా లేవు. చాలా సొసైటీల్లో మగ్గాల సంఖ్యకు, వస్త్ర ఉత్పత్తికి మధ్య పొంతన లేదని కమిటీ నివేదిక స్పష్టం చేసింది.

 నిబంధనలు బేఖాతర్: మెదక్ జిల్లాలో ఒక సొసైటీలో ఉత్పత్తి చేసే మగ్గాలు లేకున్నా.. వస్త్రాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించిన వైనం వెల్లడైంది. ఎన్‌హెచ్‌డీసీ నుంచి కనీసం 40% ముడి ఊలు కొనాలనే నిబంధన వున్నా అధికారులు.. వంద శాతం ఊలును బయటి సంస్థల నుంచి కొనుగోలు చేశారు. సొసైటీల నుంచి సరఫరా అయిన వస్త్రానికి చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించకుండా.. పలుకుబడి కలిగిన సొసైటీలకే డబ్బులు చెల్లించారు.  ఏపీ సొసైటీల నుంచి వస్త్ర సేకరణ నిలిపేయాలని, తెలంగాణ సొసైటీల నుంచే సేకరించాలనే నిబంధనను పాటించలేదని విచారణలో వెల్లడైంది.
 
 విచారణ కమిటీ సూచనలివే..
 ఆప్కో (టీఎస్)లో జరిగిన అవకతవకలను ప్రాథమికంగా నిర్ధారించిన విచారణ కమిటీ.. మరింత లోతుగా విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
  ఆప్కో ఆర్థిక లావాదేవీలు, స్టాక్ వివరాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి.
  సొసైటీల నుంచి కొనుగోలు చేసే వస్త్రం నాణ్యతను థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించాలి.
  ఆప్కో (టీఎస్) సభ్య సంఘాల నుంచి మాత్రమే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి.
  సొసైటీలు అవసరమైనంత వస్త్రాన్ని సరఫరా చేయలేని పక్షంలో.. టెండర్ లేదా ఇతర పద్ధతుల ద్వారా పవర్‌లూమ్ వస్త్రాన్ని సేకరించాలి.

>
మరిన్ని వార్తలు