బీళ్లు తడవాలి.. సిరులు పండాలి

28 May, 2017 00:13 IST|Sakshi
బీళ్లు తడవాలి.. సిరులు పండాలి

భారీ లక్ష్యాలను ఛేదించేందుకు పరుగులు పెడుతున్న నీటి పారుదల శాఖ
- ఈ ఖరీఫ్‌లో నీరందించాల్సిన ఆయకట్టు.. 8.73 లక్షల ఎకరాలు
- పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు.. 12


సాక్షి, హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే 8.73 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వాలి..! వర్షాలు మొదలయ్యే నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి చేయాలి..! సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సర్కారు నిర్దేశించుకున్న లక్ష్యాలివీ. గడువు ముంచుకొస్తుండటంతో సాగునీటి పారుదల శాఖ వేగం పెంచింది. మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుల వారీగా పర్యటనలు చేస్తున్నారు. ఆయకట్టుపై సమీక్షలకు శ్రీకారం చుట్టారు. అనుకున్న లక్ష్యం మేరకు నీరందిస్తామని దీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే చాలా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, రైల్వే, రోడ్డు క్రాసింగ్, çపునరా వాస సమస్యలు, అధికారులు, కాంట్రాక్టర్ల అలస త్వం లక్ష్యానికి అడ్డుగా నిలిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో ఎంత ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది? గత మూడేళ్లలో ప్రాజెక్టుల్లో పురోగతి ఎంత? తదితర అంశాలపై సమగ్ర కథనం..

ఇప్పటివరకు ఫర్వాలేదు..
2004–05లో జలయజ్ఞం కింద నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 3 ప్రాజెక్టులు పూర్తి కాగా.. మరో 14 ప్రాజెక్టుల్లో ఆయకట్టు పాక్షికంగా వృద్ధిలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 2013–14 నాటికి 6,14,897 ఎకరాలు కొత్తగా సాగులోకి రాగా.. మరో 92,584 ఎకరాల స్థిరీకరణ జరిగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలం గాణ మరో రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టడంతో 36 ప్రాజెక్టుల వ్యయం రూ.1.90 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.58,606 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఆయకట్టుకు సంబంధించి 2014లో పెద్దగా ఫలితాలు రాకున్నా.. 2015 మార్చి నుంచి ప్రాజెక్టులు వేగం అందుకున్నాయి. ప్రాజెక్టుల కోసం 2014–15లో రూ.5,285.03 కోట్లు, 2015–16లో రూ.7,189.21 కోట్లు, 2016–17లో రూ.15 వేల కోట్లు వెచ్చించడంతో ఆయకట్టు గణనీయంగా పెరిగింది. దీంతో 2004 నుంచి 2014 వరకు 6 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు రాగా.. ఈ మూడేళ్లలో మరో 6.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందింది. 5.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. మొత్తంగా 2004 నుంచి ఇప్పటిదాకా కొత్తగా వచ్చిన ఆయకట్టు 12.29 లక్షల ఎకరాలకు చేరింది.

ఈ ఖరీఫ్‌లో భారీ లక్ష్యం..
ఈ ఏడాది ఖరీఫ్‌లో 12 ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేయాలని, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ లక్ష్యంగా నిర్దేశిం చుకుంది. దీంతో సుమారు 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని సంకల్పిం చింది. ఇందుకు ఈ బడ్జెట్‌లో ఏకంగా రూ.11 వేల కోట్ల మేర కేటాయింపులు చేసింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు పూర్తి చేసేందుకు కొన్ని కీలక అడ్డంకులను ప్రభుత్వం దాటాల్సి ఉంది. అది పూర్తయితేనే నిర్ణీత ఆయకట్టుకు నీరందుతుంది.

ప్రధాన ప్రాజెక్టుల స్వరూపం ఇదీ..
కల్వకుర్తి
అంచనా వ్యయం: 4,896.24 కోట్లు
చేసిన వ్యయం: 3,520.21 కోట్లు
ప్రధాన సమస్యలు: మరో 1,346 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. కాల్వల సామర్థాన్ని పెంచాల్సి ఉంది. గుడిపల్లిగట్టు లిఫ్టు కింద 150 హెక్టార్ల మేర అటవీ భూమిని బదలాయించాల్సి ఉంది. స్టేజ్‌–1కు క్లియరెన్స్‌ వచ్చినా.. స్టేజ్‌–2కు ఇంకా రావాల్సి ఉంది.

భీమా
అంచనా వ్యయం: 2,658.48 కోట్లు
చేసిన వ్యయం: 2,331.71 కోట్లు
ప్రధాన సమస్య: 1,117 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. లిఫ్ట్‌–1 కింద పంచదేవ్‌పాడ్‌ గ్రామం, లిఫ్టు–2 కింద శంకరసముద్రం రిజర్వాయర్‌ కోసం అవసరమైన ఆర్‌అండ్‌ఆర్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడ సైతం కాల్వల సామర్థ్యం పెంచాల్సి ఉంది.

నెట్టెంపాడు
అంచనా వ్యయం: 2,331.47 కోట్లు
చేసిన వ్యయం: 2,044.50 కోట్లు
సమస్యలు: ఇంకా 1,222 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. 5 చోట్ల రైల్వే క్రాసింగ్‌ సమస్యలను అధిగమించాల్సి ఉంది. గట్టు లిఫ్ట్‌ కింద ఆయకట్టును 3 వేల నుంచి 28 వేలకు పెంచాలని నిర్ణయించగా.. డీపీఆర్‌ ఇంకా పూర్తి కాలేదు.

ఎస్సారెస్పీ స్టేజ్‌–2
అంచనా వ్యయం: 1,220.41 కోట్లు
చేసిన వ్యయం: 1,068.78 కోట్లు
సమస్యలు: 1,274.67 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 22 చోట్ల రోడ్ల క్రాసింగ్‌ సమస్యలున్నా యి. 3 గ్రామాలు పాక్షికంగా ముంపు ప్రాంతం లో ఉండగా.. 332 కుటుంబాలు ప్రభావితం అవుతున్నాయి. 173 కుటుంబాలను తరలించ గా.. మిగతావారిని తరలించాల్సి ఉంది.

దేవాదుల
అంచనా వ్యయం: 13,445.73 కోట్లు
చేసిన వ్యయం: 8,751.81 కోట్లు
సమస్యలు: ప్యాకేజీ–1లో ఇన్‌టేక్‌ నుంచి ధర్మ సాగర్‌ వరకు 344 హెక్టార్లు, ప్యాకేజీ–3లో రంగ య్య, ఎర్రయ్య ట్యాంక్‌ల పరిధిలో, డిస్ట్రిబ్యూ టరీల్లో కలిపి మొత్తంగా 1101.68 హెక్టార్ల అటవీ భూములను బదలాయించాల్సి ఉంది. ఇంకా 5,642 ఎకరాల మేర భూసేకరణ చేయాలి.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు