'ప్రజోపయోగ పనులకు ప్రాధాన్యమివ్వండి'

7 Sep, 2015 16:08 IST|Sakshi

అడ్డాకుల (మహబూబ్‌నగర్ జిల్లా) : 'మిషన్ కాకతీయ' పనుల్లో ప్రజలకు ఉపయోగపడే కాలువల మరమ్మతుల లాంటి అత్యవసరమైన పనులకు ప్రాధాన్యమివ్వాలని నీటిపారుదలశాఖ ఈఈ విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన వనపర్తికి వెళ్లే ముందు మూసాపేట చౌట చెరువు నుంచి విడుదలయ్యే వరద నీళ్లు కొమిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే కొత్త కాలువను ఈఈ పరిశీలించారు. కాలువ పూర్తిగా పూడిపోయిన నేపథ్యంలో మురుగు నీళ్లు కాలువలోంచి ముందుకు వెళ్లే వీలే లేదు. దీంతో కాలువను బాగు చేయిస్తే మురుగు నీళ్లు ఇళ్ల సమీపాల్లో నిలువ ఉండకుండా చేసే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ ఏఈ జయరామ్ ఈఈ విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కాలువను పరిశీలించారు.

కాలువ సమీపంలో ఉన్న ఇళ్ల చుట్టూ నిలిచిన మురుగు నీళ్లను చూసి స్థానికులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మురుగు నీళ్ల మూలంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులను చూసి ఈఈ చలించిపోయారు. కాలువను బాగు చేయించడానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇళ్ల నుంచి నీళ్లు కాలువలోకి వచ్చేలా కొత్తగా ఓ కాలువను తీయించే విధంగా చూడాలని ఏఈకి సూచించారు. అదేవిధంగా మిషన్ కాకతీయ పనులను నాణ్యవంతంగా చేయించాలని చెప్పారు. మిషన్ కాకతీయ పనుల్లో రైతులతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని చేయించే విధంగా కృషి చేయాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు