ప్రత్యేక హోదాపై వైఖరేంటి?

25 Aug, 2015 02:14 IST|Sakshi
ప్రత్యేక హోదాపై వైఖరేంటి?

* చంద్రబాబు స్పష్టం చేయాలని రోజా డిమాండ్
* 29వ తేదీన బంద్‌ను వ్యతిరేకించేది అభివృద్ధి వ్యతిరేక శక్తులే

సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం ఢిల్లీ వెళుతున్నారా? లేక తన హోదాను కాపాడుకోడానికి వెళుతున్నారా? చెప్పాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ప్రశ్నించారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు ఇప్పటికి ఎన్నిసార్లు కలిశారు? ఆయనకు ఏమని వినతులు చేశారో అన్నింటిపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని రోజా డిమాండ్ చేశారు.బాబు ప్రత్యేక హోదాకు అనుకూలమా? వ్యతిరేకమా? ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? రాకుంటే టీడీపీ మంత్రులు ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతారా? వైదొలుగుతారా? అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులను బయటకు పంపుతారా లేక ఉంచుకుంటారా? సమాధానం చెప్పాలన్నారు.

రైతులకు పంటల ఉత్పాదక వ్యయానికి 50 శాతం లాభం కలిపి ఎంఎస్‌పీ ధర ఇవ్వాల్సి ఉండగా గత ఏడాది, ఈ ఏడాది ధాన్యం ధరపై కేవలం రూ.50 మాత్రమే పెంచినా ఎందుకు నిలదీయలేదన్నారు. నారాయణ కళాశాలలో జరిగిన 11 ఆత్మహత్యలకు కారణం యాజ మాన్య వైఖరే కారణమని  బయటపడిందని, ఈ విచారణ నివేదికను కూడా రిషితేశ్వరి నివేదికలాగే దాచేస్తారా? అని ఆమె మండిపడ్డారు.

రాష్ట్రసమస్యలన్నింటినీ పక్కన పెట్టి మనది జాతీయ పార్టీ అయిందనీ, దానికేం పేరు పెట్టాలని మాట్లాడ్డంతో పాటుగా అండమాన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడం సిగ్గు చేటన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈనెల 29వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చిన బంద్‌ను భగ్నం చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని,  దీనిని అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. 29వ తేదీన బంద్‌కు అందరూ మద్దతు నివ్వాలని, దీనిని వ్యతిరేకించే వారంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేక శక్తులుగా భావించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు