హైదరాబాద్ శివార్లలో ఐసిస్ సభ్యుల షూటింగ్ ప్రాక్టీసు

29 Jun, 2016 12:51 IST|Sakshi
హైదరాబాద్ శివార్లలో ఐసిస్ సభ్యుల షూటింగ్ ప్రాక్టీసు

రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లో పేలుళ్లకు ఐసిస్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భగ్నం చేసింది. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు.. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఐసిస్ సానుభూతిపరులు షూటింగ్ ప్రాక్టీసు చేసినట్లు తెలిసింది. మీర్ చౌక్, మొగల్ పురా, భవానీ నగర్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలలో ఎన్ఐఏ తనిఖీలు సాగాయి.

పోలీసుల అదుపులో  మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ,అబ్దుల్లా బిన్ మహ్మద్ అల్మోడీ, అబిన్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్, ముజఫర్ హుస్సేన్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణపై వారిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వీళ్ల వద్ద రెండు 9 ఎంఎం పిస్టళ్లతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విదేశీ కరెన్సీ, ఎలక్ట్రికల్ వస్తులు, అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 15 లక్షల నగదును కూడా ఎన్ఐఏ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ సందర్భంలో ఇబ్రహీం కుటుంబ సభ్యులు మీడియాపై దాడి చేశారు. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంటికి వెళ్లిన సమయంలో కూడా.. ఐదు నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇబ్రహీం కుటుంబ సభ్యులు బెదిరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు