ఇదేం ‘పరీక్ష’?

3 Mar, 2016 04:10 IST|Sakshi
ఇదేం ‘పరీక్ష’?

♦ కుర్చీలు, బెంచీలు లేక ఇంటర్ విద్యార్థుల వెతలు
♦ ‘నిమిషం’ నిబంధనతో పలువురు పరీక్షకు దూరం
♦ తొలి రోజు 94.51 శాతం హాజరు నమోదు
 
 సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణలో తొలి రోజు కొన్ని గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో కూర్చునేందుకు కుర్చీల్లేక, రాసుకునేందుకు బల్లల్లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. గ్రామాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు సకాలంలో బస్సులందక జిల్లాల్లో, ట్రాఫిక్ సమస్య వల్ల హైదరాబాద్‌లో పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ‘నిమిషం లేటు’ నిబంధన వల్ల వందలాది మంది పరీక్షకు దూరమయ్యారు. పలు జిల్లాల నుంచి మాస్ కాపీయింగ్ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్  ద్వితీయ భాష పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,82,666 మందికి గాను 4,56,148 మంది (94.51శాతం) హాజరైనట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని పేర్కొంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులను పంపారు.

► నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు సరిపడా బెంచీల్లేక నేల మీద కూర్చునే రాయాల్సి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కొన్ని కేంద్రాల్లో  కుర్చీలు వేసినా రాసే బల్లల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
► యాజమాన్యం హాల్‌టికెట్లివ్వలేదంటూ రాజేంద్రనగర్‌లోని విజనరీ కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఈ కాలేజీ రాజేంద్రనగర్‌లో అనధికారిక శాఖను నడుపుతున్నట్టు తెలిసింది.
► మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌లో ఇంటర్ విద్యార్థిని ప్రమాదానికి గురైంది. చికిత్స చేయించుకొని గంట ఆలస్యంగా రాగా పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.
► హైదరాబాద్‌లో మైత్రివనం వద్ద ట్రాఫిక్‌జామ్ కావడంతో యూసుఫ్‌గూడలోని చైతన్య జూనియర్ కాలేజీ పరీక్ష కేంద్రానికి ప్రశ్నపత్రాలు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాయి. విద్యార్థులకు ఆ మేర అదనపు సమయమి చ్చా రు. హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా ప్రశ్నపత్రాలు ఆలస్యమయ్యాయి.
► మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్, ఖమ్మం జిల్లా ఇల్లెందు, నల్గొండ జిల్లా ఆత్మకూరు, వరంగల్ జిల్లా సంగెం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌ల్లోని పలు కేంద్రాల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులు రావడంతో అక్కడ నిఘా పెంచారు.
► వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని కేంద్రాల్లో విద్యార్థులకు తాము చదువుకున్న సిలబస్ నుంచి కాకుండా వేరే సిలబస్, వేరే గ్రూప్ తాలూకు ప్రశ్నపత్రాలు వచ్చాయి.  అధికారులు వెంటనే వాటిని మార్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు