'సమాజాభివృద్ధికి అంతరిక్ష పరిశోధనలు'

10 Sep, 2015 17:55 IST|Sakshi

హైదరాబాద్: మానవసహిత అంతరిక్ష ప్రయోగం ఎప్పుడు జరగాలన్నది నిర్ణయించాల్సింది తాము కాదని, దేశ ప్రజలు, ప్రభుత్వమేనని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అంతరిక్ష ప్రయోగాలను మానవ సమాజాభివృద్ధికి మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్నదే ఇస్రో లక్ష్యమని ఆయన అన్నారు. రామకృష్ణమఠం ఆధ్వర్యంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 15వ వార్షికోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిరణ్‌కుమార్ కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కీలక సాంకేతిక పరిజ్ఞానాలను అభివద్ది చేసుకుంటున్నా.. అసలు ప్రయోగం ఎప్పుడన్నది మాత్రం ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. అందుబాటులోని వనరులను సమర్థంగా, సృజనాత్మకంగా వాడుకోవడం ద్వారా, సమష్టి కృషితో మంగళ్‌యాన్ ప్రయోగం విజయవంతమైందని అన్నారు.

శాస్త్రవేత్తలైనా, ఆధ్యాత్మికవేత్తలైనా ఇద్దరి లక్ష్యం సత్యాన్ని శోధించడమేనని తెలిపారు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచంలోని వస్తువులపై ప్రయోగాలు చేస్తూ అంతిమ సత్యాన్ని అన్వేషిస్తే... ఆధ్యాత్మిక వేత్తలు ఇదే పనిని మెదడు, చేతనావస్థల సాయంతో చేపడతారని వివరించారు. దాదాపు వందేళ్ల క్రితమే వివేకానందుడి ఆలోచనల ఫలితంగా బెంగళూరులో దేశం గర్వించదగ్గ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సైస్ ఏర్పడిందని అక్కడ విద్యనభ్యసించిన విక్రమ్ సారాభాయ్, సతీశ్‌ధవన్ వంటి మహామహులు ఇస్రోకు ప్రాణం పోశారని అన్నారు. ఈ క్రమంలో సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రకతి సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం హైదరాబాద్ విభాగం అధ్యక్షులు జ్ఞానానంద మహారాజ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డెరైక్టర్ వి.కె.గాడ్గిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు