8వ తరగతిలోనే ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ల జారీ

21 Nov, 2015 20:09 IST|Sakshi

 అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
 
 హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు తమ జనన ధ్రువీకరణ (బర్త్ సర్టిఫికేట్) పత్రాల్లోనే కుల ధ్రువీకరణ కూడా నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఎస్సీ, ఎస్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పలు మార్పులు చేయాలని సంకల్పించినట్టు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇకనుంచి వారు చదువుకుంటున్న పాఠశాల హెడ్‌మాస్టర్ సిఫారసు మేరకు కుల ధ్రువీకరణ పత్రాలు పొందొచ్చు. విద్యార్థులు 8 వ తరగతికి వచ్చిన తర్వాత సంబంధిత పాఠశాలలోనే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు శనివారం మార్గదర్శకాలను పంపించింది.


కుల ధ్రువీకరణతో పాటు రెసిడెన్సీ (డొమిసైల్) సర్టిఫికేట్‌ను కూడా పాఠశాల హెడ్‌మాస్టర్ సిఫారసు మేరకు రెవెన్యూ అధికారులు జారీ చేయాల్సి ఉంటుంది. ఉన్నత చదువులకు, ఉద్యోగావకాశాలకు కుల ధ్రువీకరణ సర్టిఫికేట్లు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇకనుంచి 8 వ తరగతిలో ఉన్నప్పుడే సంబంధిత పత్రాలను పాఠశాల హెడ్‌మాస్టర్‌కు సమర్పించాలి.

తద్వారా హెడ్‌మాస్టర్ వాటిని రెవెన్యూ అధికారులకు సమర్పించడం, రెవెన్యూ అధికారులు 30 నుంచి 60 రోజుల్లోగా కచ్చితంగా ఆ సర్టిఫికేట్లను జారీ చేయాల్సి ఉంటుందని కేంద్రం నిర్ధేశించింది. విద్యా సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ సర్టిఫికేట్లు జారీ చేసే ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తాజా మార్పులపై డిసెంబర్ 21 లోగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని, ఆ తర్వాత దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుని కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని కేంద్రం తెలిపింది.

>
మరిన్ని వార్తలు