సంప్రదాయ పద్ధతులే మేలు

24 Feb, 2016 03:22 IST|Sakshi
సంప్రదాయ పద్ధతులే మేలు

♦ పర్యావరణ పరిరక్షణపై ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మల్లేశ్
♦ సీజీఆర్ సదస్సులో పర్యావరణ రక్షణకు వక్తల సూచనలు
 
 సాక్షి, హైదరాబాద్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సంప్రదాయంగా వస్తున్న పాత పద్ధతులను అవలంభించడమే మేలని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్ అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) మంగళవారం జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు పూర్తిగా వాడేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్ తరాల వారికి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. నష్టమేనని తెలిసినప్పటికీ పర్యావరణానికి హాని తలపెడుతున్నామని, పెరుగుతున్న కాలుష్యం ఫలితంగా భవిష్యత్తులో ఆక్సిజన్ సిలెండర్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పర్యావరణ పరిరక్షణ పట్ల యువతకు దిశానిర్ధేశం చేసే బాధ్యత అధ్యాపకులపై ఉందని మల్లేశ్ అన్నారు. భవిష్యత్ తరాలు మనుగడ సాధించాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి అన్నారు. వాతావరణంలో మార్పుల కార ణంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటున్నాయన్నారు. ప్రసార మాధ్యమాల్లోనూ రాజకీయ అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని పర్యావరణ అంశాల కు ఇవ్వడం లేదన్నారు.

ఆ అంశాల పట్ల ప్రజల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్నది కనుకనే, విభిన్న రంగాలకు చెందిన నిపుణులను ఈ సదస్సుకు ఆహ్వానించామని ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తమ్‌రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కనుకనే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని స్థాయిల్లో పర్యావరణం సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వు లు జారీచేసిందన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు లీలా లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన సమాజమే లక్ష్యంగా సీజీఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీబీఐటీ చైర్మన్ మాలకొండారెడ్డి, పర్యావరణ నిపుణులు సురేశ్‌లాల్, డాక్టర్ నర్సింహారెడ్డి, ప్రసన్నషీల, విజయలక్ష్మి, ప్రియకుమారి, కృష్ణారెడ్డి, అక్తర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా