నయీంను చంపడం మంచిదే: దినేశ్ రెడ్డి

13 Aug, 2016 13:30 IST|Sakshi
నయీంను చంపడం మంచిదే: దినేశ్ రెడ్డి

గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌కు ఏ డీజీపీ స్థాయి అధికారితోను సంబంధం లేదని మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. సంచలనం కోసమే ఇలాంటి ప్రచారం జరిగిందని అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నయీంను చంపడం మంచిదేనని, ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సలాం చేస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరానని, ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన కొంత సున్నితమైన సమాచారాన్ని ఆయనకు అందిస్తానని చెప్పారు. పోలీసు శాఖలో డీజీపీ అంటే అత్యున్నత స్థాయి అధికారి అని, ఇన్ఫార్మర్లను వాళ్లు డీల్ చేయరని చెప్పారు. మహా అయితే డీఐజీ స్థాయి అధికారి మాత్రమే ఇన్ఫార్మర్లను వాడుకుంటారన్నారు. సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లను ఇన్ఫార్మర్లుగా వాడుకుంటారని, అందులో తప్పులేదని తెలిపారు. కానీ దాన్ని సొంత లావాదేవీల కోసం, ఆస్తులు సంపాదించుకోడానికి దుర్వినియోగం చేయడం సరికాదని చెప్పారు.

నయీంను చంపడం మంచిదేనని, ఈ కేసులో ఉన్నవారందరినీ బయటకు తేవాలని దినేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని, ఆ విచారణను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇంకా ఎవరున్నా కూడా వారిని తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, ఈ కేసుతో సంబంధం లేనివారిని ఇరికిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.

సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో కలీముద్దీన్ అనే వ్యక్తి కోసం మాత్రం సీబీఐ వెతికినట్లు తనకు తెలుసని, అంతే తప్ప నయీముద్దీన్ కోసం ఎవరూ రాలేదని తెలిపారు. తాను పార్టీ ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. సిట్ విచారణలో తేడా ఏమైనా వచ్చిందనుకుంటే అప్పుడు ఎన్ఐఏ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు. ఇలాంటి కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.

తనపై ఇంతకుముందు కొంత దుష్ప్రచారం జరిగిందని ఆయన అన్నారు. గతంలో కూడా తాను డీజీపీ కాకముందు కేఎస్ వ్యాస్‌ పక్కన తాను ఉన్నానని, కాల్పులు జరిపానని ప్రచారం జరిగిందని, కానీ అసలు తాను ఆయన పక్కన లేనని చెప్పారు. వ్యాస్‌కు, తనకు మధ్య 400 గజాల దూరం ఉందని అన్నారు. అలాగే, తాను డీజీపీ కాకముందు శంషాబాద్ ప్రాంతంలో తనకు 1500 ఎకరాల భూములు ఉన్నట్లు నకిలీ పత్రాలతో ప్రచారం జరిగిందని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు