-

అలా విప్ ధిక్కరిస్తే తప్పుకాదు

25 Aug, 2016 02:07 IST|Sakshi

- తామూ పోటీ చేయాలనుకునే అభ్యర్థులను తప్పుపట్టలేమన్న హైకోర్టు
- అది సభ్యుల కొనుగోళ్ల వ్యవహారం పరిధిలోకి రాదు
- పోటీ చేయకుండా విప్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తేనే ధిక్కరించినట్లని స్పష్టీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: వివిధ ఎన్నికల సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు జారీ చేసే విప్‌ల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పార్టీ నుంచి ఎన్నికైన అభ్యర్థి తానే సంబంధిత పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకుని.. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరిస్తే అది సభ్యుల కొనుగోళ్ల వ్యవహారం (హార్స్ ట్రేడింగ్) పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఏదైనా పదవికి పోటీ చేయాలని ఓ అభ్యర్థి నిర్ణయించుకున్నప్పుడు, ఆ అభ్యర్థికి పార్టీ విప్ జారీ చేసి మరో అభ్యర్థికి ఓటు వేయాలనడం హక్కులను హరించడమే అవుతుందని తేల్చి చెప్పింది. అయితే పదవికి పోటీలో ఉండని సందర్భంలో.. పార్టీ విప్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే అది విప్ ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే అధ్యక్ష, ఉపాధ్యక్ష పోస్టులకు పోటీ చేయాలనుకున్న ప్రజా ప్రతినిధులను విప్ ద్వారా నియంత్రించడం రాజ్యాంగ నిర్మాణాన్ని నాశనం చేస్తుందా అన్నది విస్తృతమైన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది.

‘‘ఓ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు క్రమశిక్షణతో మెలిగేందుకు, హార్స్ ట్రేడింగ్‌ను నిరోధించేందుకే రాజకీయ పార్టీకు విప్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు. విప్ ఉల్లంఘన వల్ల నష్టపోయిన సందర్భాల్లో నాయకులు, అభ్యర్థుల్లో క్రమశిక్షణ లోపించిందని అంటుంటారు. అదే సమయంలో ఉల్లంఘన వల్ల లబ్ధి పొందిన వారు మాత్రం అంతరాత్మను అనుసరించే నడుచుకున్నామని చెబుతారు..’’ అని వ్యాఖ్యానించింది. 2014లో జరిగిన నిజామాబాద్ జిల్లా బిక్‌నూర్ మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో... డి.రాణి అనే ఎంపీటీసీ సభ్యురాలు పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుండా విప్‌ను ఉల్లంఘించారని, ఆమెపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రాణి విప్‌ను ధిక్కరించారని నిర్ధారించిన ఎన్నికల అధికారి ఆమెపై అనర్హత వేటు వేశారు. దీనిపై ఆమె జిల్లా కోర్టును ఆశ్రయించగా.. ఎన్నికల అధికారి ఉత్తర్వులను నిలిపి వేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విప్ హైకోర్టులో అప్పీలు చేశారు. దానిపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తలు