సీతారాం.. c/o సెటిల్‌మెంట్

1 Apr, 2015 00:26 IST|Sakshi
సీతారాం.. c/o సెటిల్‌మెంట్

ఏసీపీపై సస్పెన్షన్ వేటు  భూ వివాదాలలో భారీగా వసూళ్లు
పదుల సంఖ్యలో బాధితులు  సీఐగానూ ఇదే తీరుతో సస్పెండ్
 డీజీపీ విచారణలో వెలుగు చూసిన నిజాలు

 
సిటీబ్యూరో:  చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్‌కేపురం సర్వే నెంబర్ 9/1లో రెండెకరాల స్థలంపై ‘విమలానంద, వైశ్యా హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ’ సభ్యులకు... రౌడీషీటర్ ఘోరెమియాకు మధ్య భూ వివాదం నెలకొంది. ఘోరెమియాతో  కుమ్మక్కైన ఏసీపీ సీతారాం సొసైటీ సభ్యుల ఖాళీ ప్లాట్లను తన బంధువు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని...  సభ్యులను బెదిరించారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో  హకోర్టు న్యాయవాది కనకయ్య కుమార్తెకు 2000 గజాల స్థలం ఉంది. ఇటీవలే జీహెచ్‌ఎంసీ అనుమతులు తీసుకుని నిర్మాణం ప్రారంభించగా... ఘోరెమియా అడ్డం వచ్చాడు. బాధితురాలు ఏసీపీని ఆశ్రయించగా... రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోవడంతో ఆ స్థలంలోని ప్రహరీని కూలదోయించాడు. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో శేఖర్‌కు 200 గజాల ఖాళీ స్థలం ఉంది. ఇటీవలే నిర్మాణం ప్రారంభించగా... లంచం ఇవ్వలేదనే కక్షతో పోలీసులను పంపించి పనులను ఆపించాడు.

ఇలా ఒకటీ... రెండూ కాదు. పదుల సంఖ్యలో భూ వివాదాలలో తలదూర్చిన ఏసీపీ సీతారాంపై బాధితులు ఉన్నతాధికారులకు సుమారు 50కిపైగా ఫిర్యాదులు చేశారు. దీంతో డీజీపీ అనురాగ్ శర్మ స్పందిస్తూ మంగళవారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.  బాధితుల్లో టెలికాం, వాటర్‌వర్క్స్, జీహెచ్‌ఎంసీ, హైకోర్టు ఉద్యోగులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి కుమారుడు, టీఆర్‌ఎస్ నేత సాగర్‌రెడ్డి, శైలజలు ఉన్నారు. బాధితుల సంఖ్య సుమారు 173 వరకు ఉంటుందని అంచనా. పూర్తి వివరాల్లోకి వెళితే... 1991లో ఎస్‌ఐగా పొందిన పి.సీతారాం మెదక్ జిల్లాలో మొదట్లో విధులు నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి వచ్చిన తరువాత సైబరాబాద్‌లో కుషాయిగూడ, ఇబ్రహీంపట్నంలలో ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరిలో డీఎస్పీగా పదోన్నతి పొంది... ఎల్బీనగర్ ఏసీపీగా విధుల్లో చేరారు. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న భూ వివాదాలపై అతని కన్ను పడింది. ఇరువర్గాల వారిని పిలిపించుకుని బలవంతపు సెటిల్‌మెంట్లు చేసేవారు. కొన్ని కేసులలో తన బంధువు పేరుపై కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు చేయించారు.

ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే అటు వైపు మొగ్గు చూసి సహకరించేవారు. పదుల సంఖ్యలో బలవంతపు సెటిల్‌మెంట్లకు పాల్పడి రూ.కోట్లు సంపాదించాడని బాధితుల ఆరోపణ. అతని వేధింపులు భరించలేని బాధితులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, డీ జీపీ అనురాగ్‌శర్మకు దఫదఫాలుగా ఫిర్యాదులు చేశారు. దీంతో అతనిపై విచారణకు ఆదేశించారు. ఎల్బీ నగర్ డీసీపీ తస్వీర్ ఎక్బాల్ ఇటీవల విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. ఈ విచారణలో సీతారాం అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమైనట్టు తేల్చారు. దీంతో ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.ప్రస్తుతం వివాదాస్పద 9/1 సర్వే నెంబర్ భూమిలో ఘోరెమియా, అతని 50 మంది అనుచరులు తిష్ట వేశారు.

ఎస్‌ఓపీని తుంగలో తొక్కి...

సైబరాబాద్‌లో పెరిగిపోతున్న భూ వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఏడాది క్రితం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)  విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కాపీలను అన్ని స్టేషన్లకు పంపించారు. ఎస్‌ఓపీ నిబంధనలు, విధానాన్ని పక్కన పెట్టిన ఏసీపీ సీతారాం తనదైన స్టైల్‌లో సెటిల్‌మెంట్లకు తెరలేపారు.

గతంలోనూ...

ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే సీతారాం అక్రమాలకు తెరలేపారు. భూ వివాదాలలో జోక్యం చేసుకుని బలవంతపు సెటిల్‌మెంట్లకు పాల్పడ్డారు. అప్పటి పోలీసు కమిషనర్ ప్రభాకరరెడ్డికి  బాధితులు ఫిర్యాదు చేయడంతో విచారణలో సీతారాం అక్రమాలు వెలుగు చూశాయి. దీంతో అత ణ్ణి సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ల డివిజన్ ...

ఎల్బీనగర్ ఏసీపీలుగా బాధ్యతలు నిర్వహించిన అధికారుల్లో వరుసగా నలుగురు వివిధ ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ హర్షవ ర్ధన్‌రెడ్డి అనే ఏసీపీ గతంలో సస్పెండయ్యారు. ఆ తరువాత వచ్చిన లక్ష్మీకాంత్ షిండేపై ఇదే రీతిలో సస్పెన్షన్ వేటు పడింది. రెండేళ్ల క్రితం ఇక్కడ ఏసీపీగా పని చేసిన వెంకట్‌రెడ్డి కేవలం ఐదు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఈము కోళ్ల మాంసాన్ని సీజ్ చేసిన ఘటనలో సస్పెండయ్యారు. తాజాగా సీతారాం సస్పెండ్ కావడంతో దీనిపై సస్పెన్షన్ల డివిజన్‌గా ముద్ర పడింది. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడంతో ఇలాంటి ఉదంతాలుపునరావృతమవుతున్నాయి.

ఏ నేరమూ చేయలేదు

నేను ఎవరి భూమినీ కబ్జా చేయలేదు. ప్లాట్ యజమానులను బెదిరించలేదు. 9/1 సర్వే నెంబర్ భూమి సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. చట్ట ప్రకారమే నడుచుకున్నా. కొంతమంది నాపై కక్ష కట్టి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఎవరి వద్దనూ ఒక్క పైసా లంచం తీసుకోలేదు. మా బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాననే ఆరోపణలు అవాస్తవం.    - ఏసీపీ సీతారాం
 

మరిన్ని వార్తలు