అమరావతి మెట్రోకి జైకా ఝలక్!

4 Jul, 2016 01:29 IST|Sakshi
అమరావతి మెట్రోకి జైకా ఝలక్!

రుణ సాయానికి జపాన్ సంస్థ విముఖత
 
 సాక్షి, హైదరాబాద్ : అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టుకు బాలారిష్టాలు తప్పడం లేదు. అడుగడుగునా బ్రేకులు పడుతుండటంతో రెండు కారిడార్లుగా నిర్మించాలనుకున్న ఈ ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. తాజాగా ఆ మెట్రోకి జపాన్ రుణ సంస్థ జైకా ఝలక్ ఇచ్చింది. తొలి దశలో 26 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం నిర్మించేందుకు కేంద్రానికి గతంలోనే ఏపీ సర్కారు ప్రతిపాదనలు పంపింది. మెట్రో ప్రాజెక్టు సలహాదారుగా శ్రీధరన్‌ను నియమించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

మెట్రో రైలు డీపీఆర్‌లో సాంకేతిక వివరాలు, భద్రతకు సంబంధించిన అంశాలు విమానయాన, దక్షిణ మధ్య రైల్వే అనుమతులు లేకపోవడాన్ని కేంద్రం తప్పు పట్టింది. తాజాగా మెట్రోకు రుణమిచ్చే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) పలు ఆంక్షలు పెట్టింది. మొత్తం ప్రాజెక్టుకు అవసరమయ్యే రూ. 8 వేల కోట్లలో రూ. 4 వేల కోట్లకు పైగా నిధులు అతి స్వల్ప వడ్డీ రేటు 0.3 శాతంతో జైకా రుణం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలో జైకా ప్రతినిధులతో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు సమావేశమైన సందర్భంలో జపాన్ ప్రతినిధులు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అమరావతి మెట్రోకి కన్సల్టెంట్‌గా ఉన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)ను తప్పించాలని, ఇరువురికి ఆమోదయోగ్యమైన మరో కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని జైకా ప్రతినిధులు సూచించినట్లు తెలిసింది. అమరావతి మెట్రోకి రుణమిచ్చేందుకు ఇష్టం లేకపోవడంతోనే ఈ తరహా సూచనలు జైకా ప్రతినిధులు చేసినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు