కేసీఆర్‌కు జొన్నన్నం పెడతా..

29 Dec, 2016 00:51 IST|Sakshi
కేసీఆర్‌కు జొన్నన్నం పెడతా..

- సీఎం భోజనానికి వస్తానన్నది సరదాకే..: జానారెడ్డి
- కేసీఆర్‌ నా దగ్గరకొచ్చే ధైర్యం చేయరు: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షనేత ఇంటికి భోజనానికి వెళ్లి.. పప్పు పెట్టినా, పులుసు పెట్టినా తిని రావాలని ఉందంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు బుధవారం అసెంబ్లీ లాబీల్లో సరదా సంభాషణలకు కారణమయ్యాయి. దీనిపై ప్రతిపక్షనేత కె.జానారెడ్డిని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మా ఇంటికి భోజనానికి రావాలనే కోరిక ఉన్నట్టు కేసీఆర్‌ చెప్పారు. కానీ వస్తున్నట్టుగా చెప్పలేదు. అయినా అది సరదాకు చేసిన వ్యాఖ్య. దానిలో రాజకీయం ఉందనుకోవడం లేదు.

ఒకవేళ కేసీఆర్‌ మా ఇంటికి వస్తే జొన్న అన్నం పెడతా. కేసీఆర్‌తో నేను కలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి లాభమా, నష్టమా అనేది కలిసిన తర్వాత విశ్లేషించుకోవచ్చు..’’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ ప్రస్తావించగా ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామికంగా, హుందాగా వ్యవహరించడం లేదని ఉత్తమ్‌ విమర్శించారు. ప్రతిపక్షపార్టీల నేతలను గౌరవించాలనే సంస్కారం లేని కేసీఆర్‌కు తనతో కలసి భోజనం చేసే ధైర్యం చేయరని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు