పార్టీ ఫిరాయింపులపై మళ్లీ హాట్ హాట్‌ గా చర్చ

26 Dec, 2016 15:10 IST|Sakshi
పార్టీ ఫిరాయింపులపై మళ్లీ హాట్ హాట్‌ గా చర్చ

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీ-పాస్‌ చర్చ సందర్భంగా  పార్టీ ఫిరాయింపులపై మరోసారి వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌కు స్పీకర్‌ మైక్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ పక్ష ఉపనేత జీవన్‌ రెడ్డి అభ్యంతరం తెలిపారు. పార్టీ మారిన వ్యక్తికి కాంగ్రెస్‌ తరఫున మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. పువ్వాడ అజయ్‌ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ శాసనసభ సభ్యుడిగా అజయ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలపగా, మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్‌ స్పీకర్‌ వ్యాఖ్యలను సమర్థించారు.  స్పీకర్‌ అధికారాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ స్పీకర్‌ నిర్ణయమే ఫైనల్‌ అని అన్నారు. 2004-14 వరకూ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ సభాపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్లే మాట్లాడాలన్నారు.  నిబంధనలకు వ్యతిరేకంగా సభ జరిగితే ప్రశ్నిస్తామని అన్నారు. అధికారం ఉందికదా అని ఏమైనా చేస్తామనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సభ్యులను స్పీకర్‌ కంట్రోల్‌ చేయాలని అన్నారు.

మరోవైపు పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ సభ్యుడిగా తన హక్కులను కాలరాయడం సరికాదన్నారు. తాను మాట్లాడే అవకాశం అడిగితే స్పీకర్‌ అనుమతి ఇచ్చారని, ఇందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు.