నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు

28 Apr, 2017 03:00 IST|Sakshi
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు

మే 21న పరీక్ష.. టాప్‌ 2.2 లక్షల మందికి అనుమతి
- జూన్‌ 11న ఫలితాలు.. 19 నుంచి ప్రవేశాలు
- షెడ్యూల్‌ విడుదల చేసిన మద్రాస్‌ ఐఐటీ


సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గురువారం జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలైన నేప థ్యంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రక్రియను మద్రాస్‌ ఐఐటీ చేపట్టింది. మే 21న ఈ పరీక్ష జరు గనుంది. జేఈఈ మెయిన్‌కు 11 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. అందులో అర్హత సాధించిన వారిలో టాప్‌ 2.2లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమ తిస్తారు.

మే 2 వరకు దరఖాస్తులు..
28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 2వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని మద్రాస్‌ ఐఐటీ వెల్లడించింది. రిజిస్ట్రేషన్, సీట్లు, ఫీజు తదితర వివరాలను సంబంధిత ఇన్ఫర్మేషన్‌ బ్రోచర్‌లో పొందవచ్చని పేర్కొంది. 2015 జేఈఈ మెయిన్‌లో టాప్‌ 1.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతించగా.. 2016లో టాప్‌ 2 లక్షల మందికి అవకాశమిచ్చామని తెలిపింది. సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు ఈసారి టాప్‌ 2.2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తామని వివరించింది. రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా చూస్తే... అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్‌ కేటగిరీలో 1,11,100 మంది (50.5 శాతం), ఓబీసీలో 59,400 మంది (27 శాతం), ఎస్సీల్లో 33 వేల మంది (15 శాతం), ఎస్టీల్లో 16,500 మందిని (7.5 శాతం) అనుమతిస్తామని వివరించింది.

మరిన్ని అర్హత వివరాలు
► 1992 అక్టోబర్‌ 1న, ఆ తర్వాత జన్మించిన వారు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
► జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఒక అభ్యర్థి మొత్తంగా మూడుసార్లు, వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరుకావచ్చు.
► ఇంటర్‌ వార్షిక పరీక్షలు 2016 రాసిన వారు, 2017లో రాయబోయే వారు కూడా హాజరుకావచ్చు. 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2015 జూన్‌ తరువాత ఫలితాలు వచ్చిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ రాయవచ్చు.
► ఇప్పటికే ఐఐటీల్లో చేరిన వారు, గతంలో ఐఐటీల్లో సీట్లు పొంది కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేశాక సీటును రద్దు చేసుకున్న వారు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనర్హులు.
► అయితే 2016 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సీటు లభించాక సీటు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి, సీటును యాక్సెప్ట్‌ చేయని వారు (జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌లో భాగంగా రిపోర్టింగ్‌ కేంద్రాల్లో ఎక్కడా రిపోర్టు చేయనివారు) మాత్రం పరీక్ష రాసేందుకు అర్హులే.
► ఏదైనా ఐఐటీలో 2016లో మొదటిసారిగా ప్రిపరేటరీ కోర్సులో చేరినవారు 2017 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్‌ ఇదీ..
ఏప్రిల్‌ 28 నుంచి మే 2: అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌ (ప్రారంభ తేదీన ఉదయం 10 నుంచి, చివరి తేదీన సాయంత్రం 5 వరకు)
మే 2 నుంచి 4: ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌
మే10 నుంచి 21: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌
మే 21న: అడ్వాన్స్‌డ్‌ పరీక్ష (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్‌–2)
మే 31 నుంచి జూన్‌ 3: ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ జవాబు పత్రాల ప్రదర్శన.. విజ్ఞప్తుల స్వీకరణ
జూన్‌ 4న: ఉదయం 10 గంటలకు వెబ్‌సైట్‌లో జవాబుల కీలు
జూన్‌ 4 నుంచి 6: ‘కీ’లపై అభ్యంతరాల స్వీకరణ
జూన్‌ 11: అడ్వాన్స్‌డ్‌ ఫలితాల వెల్లడి
జూన్‌ 11, 12 తేదీల్లో: ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ)కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌
జూన్‌ 14: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష
జూన్‌ 18న: ఏఏటీ ఫలితాల విడుదల
జూన్‌ 19 నుంచి జూలై 18 వరకు: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలు.

నాలుగేళ్లుగా తగ్గుతున్న కటాఫ్‌!
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే కటాఫ్‌ మార్కులు ఏటా తగ్గిపోతున్నాయి. జేఈఈ మెయిన్‌ ప్రశ్నపత్రంలో ఒక్కోసారి ఒక్కో సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కఠినంగా వస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌డ్‌కు 2014–15లో జనరల్‌ కేటగిరీలో 115 మార్కులుగా కటాఫ్‌ ఈసారి 81కి తగ్గింది. గతేడాది ఫిజిక్స్‌లో ప్రశ్నలు కఠినంగారాగా.. ఈసారి గణితంలో కఠినంగా వచ్చాయి.

మరిన్ని వార్తలు