చుక్కలు చూపిన జేఈఈ అడ్వాన్స్‌డ్

23 May, 2016 03:17 IST|Sakshi

- మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు కఠినం
- కాస్త సులువుగా కెమిస్ట్రీ ప్రశ్నలు
- 35 % కటాఫ్.. తగ్గించే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్షలో ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. పేపర్ 1, 2ల్లోనూ మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. కెమిస్ట్రీలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయంటున్నారు. గతేడాది రెం డు పేపర్లు కలిపి మొత్తం 506 మార్కులకు ప్రశ్నలివ్వగా, ఈ ఏడాది 372 మార్కులకు ప్రశ్నలిచ్చారు. మొత్తం మార్కుల్లో 35 శాతం మార్కులొస్తే ర్యాంకులు ఇస్తామని పరీక్ష నిర్వహించిన ఐఐటీ గువాహటి ఇప్పటికే ప్రకటించింది. గతేడాది కూడా కటాఫ్ మా ర్కులను 35 శాతంగా ప్రకటించినా చివరి నిమిషంలో 25 శాతానికి తగ్గించారు.

ఈ ఏడాది కూడా కటాఫ్ మార్కులను తగ్గించి ర్యాంకులిచ్చే అవకాశం ఉదని ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు. 50 శాతం మార్కులు సాధిస్తే మంచి ఐఐటీలో మంచి బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. నెగెటివ్ మార్కులపై  ఈ ఏడాది సంపూర్ణమైన అవగాహనతో పరీక్ష రాసినందున ఆలిండియా టాప్ ర్యాంకుల్లో మూడు నుంచి నాలుగు ర్యాంకులు రాష్ర్ట విద్యార్థులకే దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రెండు పేపర్లలోనూ కాంప్రహెన్సివ్, సింగిల్ ఆప్షన్ ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని, మల్టిపుల్ ఆప్షన్లు, ఇంటీజర్ టైప్ ప్రశ్నలు అభ్యర్థులను బాగా ఇబ్బందికి గురిచేశాయని ఫిట్జీ-ఐఐటీ అకాడమీ ప్రిన్సిపల్ నాగ రవి తెలిపారు. కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలంటే సుదీర్ఘమైన లెక్కలు చేయాలని, కాలిక్యులేటర్లు లేకుండా సమాధానం చేయ డం చాలా కష్టమని పేర్కొన్నారు. సింగిల్ ఆప్షన్ టైప్ ప్రశ్నల్లో ఒకట్రెండు ప్రశ్నలకు సరైన సమాధానం లేదన్నారు.  జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రం లో మహబూబ్‌నగర్, హైదరాబాద్, వరంగల్ ప్రధాన కేంద్రాలుగా జరిగిన ఈ పరీక్షకు 95 శాతం హాజరు నమోదైనట్లు సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా ఆదివారం నాటి పరీక్షకు 19, 820 మంది ఆన్‌లైన్‌లో, 1,78,408 మంది ఆఫ్‌లైన్‌లో రాశారు.

మరిన్ని వార్తలు