రేపు జేఈఈ మెయిన్ రాతపరీక్ష

3 Apr, 2015 02:24 IST|Sakshi
రేపు జేఈఈ మెయిన్ రాతపరీక్ష

హాజరుకానున్న దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు
  నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
  మే 24న జేఈఈ అడ్వాన్స్‌డ్
  ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు ఈసారి ఒకే కౌన్సెలింగ్
 సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ/ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ రాత పరీక్ష శనివారం (ఈనెల 4న) జరగనుంది. దీనితోపాటు ఈ నెల 10, 11వ తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏర్పాట్లు పూర్తిచేసింది. బీఈ/బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష పేపర్-1 ఉదయం 9:30 నుంచి 12.30 వరకు.. బీఆర్క్/బీప్లానింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఈ రెండు పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

అయితే పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించబోమని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఇక 10, 11 తేదీల్లో జరిగే ఆన్‌లైన్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12.30 వరకు జరుగుతాయి. విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. మొత్తంగా ఈ పరీక్షలకు తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరుకానుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 80 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 27న జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా టాప్ లక్షన్నర మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తారు.
 
 
 ఇవీ పరీక్ష కేంద్రాలు..
  4న జరిగే ఆఫ్‌లైన్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 150 కేంద్రాలను సీబీఎస్‌ఈ ఏర్పాటు చేసింది. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.
  10, 11వ తేదీల్లో జరిగే ఆన్‌లైన్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 283 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో... ఏ పీలోని బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏ లూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కర్నూలు, నరసారావుపేట, నెల్లూ రు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తా డేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, వైజాగ్, విజ యనగరంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.


 మే 24న  అడ్వాన్స్‌డ్..
 జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను మే 24న నిర్వహించేందుకు బాంబే ఐఐటీ చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో టాప్ లక్షన్నర మంది విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. వారు మే 2 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 24న పరీక్ష నిర్వహించి జూన్ 18న ఫలితాలు ప్రకటిస్తారు.


 రెండింటికి ఒకే కౌన్సెలింగ్!
 ఏటా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్‌లో ప్రకటించి, ఎన్‌ఐటీ/ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ ఫలితాలను జూలైలో ప్రకటిస్తున్నారు. ఇలా వేర్వేరు తేదీల్లో ఫలితాలు ప్రకటించి, ప్రవేశాలు చేపట్టడం వల్ల ఎన్‌ఐటీల్లో సీట్లు మిగిలి పోతున్నాయి. ఐఐటీలో సీటు వస్తుందో రాదో తెలియక ఎన్‌ఐటీలో చేరి పోవడం, తీరా ఐఐటీలో వస్తే ఎన్‌ఐటీలో సీటువదులుకోవడంతో మరో విద్యార్థి నష్టపోవాల్సి వస్తోంది. దీంతో ఈసారి రెండింటికీ ఒకేసారి కౌన్సెలింగ్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
 

మరిన్ని వార్తలు