గణేశుడికి జియోట్యాగ్‌!

29 Aug, 2017 00:16 IST|Sakshi
గణేశుడికి జియోట్యాగ్‌!
- సులభతరం కానున్న వినాయక నిమజ్జనం
ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ సైతం ఏర్పాటు
- ఒక్క క్లిక్‌తో విగ్రహాల పూర్తి వివరాలు..
పోలీసులకు తప్పనున్న తిప్పలు
గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష
 
సాక్షి, హైదరాబాద్‌: వినాయక నిమజ్జనానికి హైదరాబాద్‌ పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌ కమి షనరేట్‌ పరిధిలో విగ్రహాల సంఖ్య, ఎత్తు, మండపం అనుమతి తీసుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచనుంది. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షించే ప్రతి వినాయక విగ్రహానికి జియోట్యాగ్‌ ఏర్పాటు చేశారు. గతంలో పోలీసులు మండపం వద్దకు వెళ్లి తనిఖీ చేసి తమ రిజిస్టర్‌లో నమోదు చేసుకుని, నిర్వా హకుల సంతకం తీసుకునేవారు. కానీ ఇప్పుడలా కాకుండా జియోట్యాగ్‌ ద్వారా మండపానికి 50 మీటర్ల దూరంలో ఉండ గానే హైదరాబాద్‌ ‘కాప్‌యాప్‌’ద్వారా కమాండ్‌ సెంటర్‌లో వివరాలు ప్రత్యక్షమవుతాయి. పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి వెళ్లారా లేదా అనే వివరాలనూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. 
 
విగ్రహాల వివరాలు పక్కాగా..
ఈసారి హైదరాబాద్‌లో కొత్తగా ప్రతి గణేశుడికి క్యూఆర్‌ కోడ్‌ (క్విక్‌ రెస్పాన్స్‌)ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ బార్‌కోడ్‌ ద్వారా పోలీసు సిబ్బంది ట్యాబ్‌లో స్కాన్‌ చేయగానే విగ్రహం ఎత్తు మండప నిర్వాహకులు తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి. నిమజ్జన సమయంలో విగ్రహం ఎంతవరకు వచ్చింది.. ఎప్పుడు నిమజ్జనం అవుతుంది.. వంటి వివరాలను కూడా పోలీసులకు తెలియజేస్తుందన్నమాట. ట్యాంక్‌బండ్‌ వద్ద నిమజ్జనమైన విగ్రహాల సంఖ్యను పోలీసులు లెక్కిస్తూ నమోదు చేసుకోవాల్సి వచ్చేది. క్యూఆర్‌ కోడ్‌ వల్ల ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నిమజ్జనమైన విగ్రహాల వివరాలు పక్కాగా తెలిసిపోతాయి.
 
క్రేన్‌ల రీడిజైన్‌..
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన క్రేన్‌ల కొండీల (హుక్స్‌)ను రీడిజైన్‌ చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలి పారు. విగ్రహాలు నీళ్లలోకి వెళ్లగానే కొండీలు వాటంతట అవే తెరుచుకుంటాయన్నారు. గతంలో వాటిని మనుషులు తీసేవార ని, భారీ విగ్రహాల నిమజ్జనం సమయంలో కొండీల తొలగింపు కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య ఉండబోదన్నారు.
 
24 వేల మందితో బందోబస్తు..
నగరంలో సెప్టెంబర్‌ 5న జరిగే నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తుపై డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం సమీక్ష నిర్వ హించారు. 24 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి డీజీపీకి తెలిపారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, సెంట్రల్‌ పారామిలిటరీ బలగాలు, ఏపీ పోలీస్‌ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌లోని పోలీస్‌ సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేస్తున్నట్టు తెలిపారు. యూనిఫాం సర్వీసులైన ఫారెస్ట్, ఎక్సైజ్‌ సిబ్బందిని కూడా బందోబస్తులో వినియోగించనున్నామన్నారు. ఈ మేరకు ఫారెస్ట్, ఎక్సైజ్‌ శాఖల నుంచి 2 వేల మందిని కేటాయించా లని సంబంధిత విభాగాధిపతులకు లేఖలు రాశామన్నారు. 
మరిన్ని వార్తలు