జేఎన్‌టీయూ నిర్లక్ష్యం కూడా కారణమే!

23 May, 2017 03:45 IST|Sakshi

ఎంసెట్‌ లీకేజీపై చార్జిషీట్‌లో పేర్కొననున్న సీఐడీ

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో జేఎన్‌టీయూ నిర్లక్ష్యం కచ్చితంగా ఉందంటూ సీఐడీ చార్జిషీట్‌లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ ఆధారపడి ఉన్న ఎంసెట్‌ ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌లో నిర్లక్ష్యం బయటపడిందని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ శివారులోని ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి దేశవ్యాప్తంగా అనేక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకైనట్టు కేసులున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా అదే ప్రింటింగ్‌ ప్రెస్‌కు కాంట్రాక్ట్‌ ఇవ్వడంపై చార్జిషీట్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సీఐడీ అధికారులు తెలిపారు.

పలు రాష్ట్రాలకు చెందిన 9 ప్రశ్నపత్రాలు లీకైన దాఖలాలను తెలుసుకోకుండా ఏళ్లకేళ్లుగా అదే ప్రింటింగ్‌ ప్రెస్‌కు కాంట్రాక్ట్‌ ఇవ్వడం వెనకున్న కారణాలను సైతం సీఐడీ అధికారులు చార్జిషీట్‌లో పేర్కొనబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, జేఎన్‌టీయూ వ్యవహారంపై విచారణ జరిపామని, నిందితులతో ఎక్కడా సంబంధా లున్నట్టు ఆధారాల్లేవని సీఐడీ చార్జిషీట్‌లో స్పష్టం చేయనుంది. అధికారుల పాత్ర పైనా తాము విచారణ జరిపామని, నిందితులతో గతంలో కూడా ఎలాంటి సంబంధాలున్నట్టు బయటపడలేదని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ వారంలో ఎంసెట్‌ లీకేజీపై చార్జిషీట్‌ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు