యూకే ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పేరిట బురిడీ

4 Feb, 2017 02:48 IST|Sakshi

ముంబైలో సూత్రధారిని అరెస్ట్‌ చేసిన సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  
సాక్షి, హైదరాబాద్‌: ‘యూకే ఎయిర్‌లైన్స్‌లో మంచి ఉద్యోగం ఉంది. మీ వివరాలు పంపిస్తే ఆఫర్‌ లెటర్, జాబ్‌ ఆర్డర్‌ కాపీలు పంపిస్తాం’ అంటూ ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని సూత్రధారిని రాష్ట్ర సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2010లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉద్యోగాన్వేషణ చేస్తుండగా ముంబైలోని వెస్ట్‌ అంధేరీకి చెందిన నితిన్‌ రామ్‌విలాస్‌ ప్రసాద్‌ తన స్నేహితుడు సంజీవ్‌ బోసే, ఒక నైజీరియన్‌తో కలసి అతన్ని ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పేరిట బురిడీ కొట్టించారు. అతన్నుంచి ఆర్‌టీజీఎస్‌ ద్వారా రూ.10.70 లక్షలు కొల్లగొట్టారు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు...గతంలోనే నలుగురు ఇతర నిందితులను అరెస్టు చేశారు.

అయితే ఆరేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నితిన్‌ రామ్‌విలాస్‌ ప్రసాద్‌ను సీఐడీ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ బృందం ముంబైలో తాజాగా అరెస్ట్‌ చేసింది. ఈ ముఠా యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అనేక మందిని ఇలాగే మోసగించి డబ్బులు వసూలు చేసినట్టు దర్యాప్తులో తెలిసిందని సైబర్‌ క్రైమ్‌ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. లాటరీలు, స్వచ్ఛంద సంస్థలు, చారిటీలు, ఆన్‌లైన్‌ ఉద్యోగ ప్రకటనలు, వర్క్‌ ప్రమ్‌ హోం తదితర సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మిమోసపోవద్దని, ఇలాంటి సందేశాలు మొబైల్‌ ఫోన్లకు వస్తే cybercrimesps@cid.tspolice.gov.in కు ఫిర్యాదు చేయాలని సీఐడీ ఐజీ తెలిపారు.

మరిన్ని వార్తలు