సెక్రటేరియట్‌లో ఉద్యోగాలంటూ టోకరా

8 Jun, 2016 18:33 IST|Sakshi

బంజారాహిల్స్: నగరంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన రహ్మత్నగర్లో వెలుగులోకి వచ్చింది. సచివాలయం, జీహెచ్‌ఎంసీ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతీ, యువకులను నమ్మించి లక్షలాది రూపాయలు దండుకున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడిని తక్షణం అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు బుధవారం పీఎస్లో బైఠాయించారు.

వివరాల్లోకి వెళ్లితే... గోల్కొండ సమీపంలోని పుప్పాలగూడ కిజ్రా ఎన్‌క్లేవ్‌లో నివసించే మహ్మద్ ఫయాజ్(55) రహ్మత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్ చుట్టుపక్కల నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ముఖ్యంగా సచివాలయం, జీహెచ్‌ఎంసీ, కోర్టులు, నిజాంక్లబ్‌లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరికి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని వసూలు చేశాడు. 14 మంది నిరుద్యోగులు ఒక్కొక్కరు రూ.70 వేల చొప్పున చెల్లించారు. అయితే ఎంతకూ ఉద్యోగాలు రాకపోగా ఇటీవల డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడటమే కాకుండా కేసుల్లో ఇరిస్తానంటూ బెదిరించాడు. గట్టిగా అడిగితే కులం పేరుతో దూషించామంటూ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడని సుజాత అనే బాధితురాలు తెలిపారు. ఆమెతో రాజు, నాగేష్, మహేష్ తదితర 14 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫయాజ్‌పై ఐపీసీ సెక్షన్ 406, 448, 420, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు