ఇంక్రిమెంట్‌లో కోత విధింపు చెల్లదు

26 Feb, 2017 03:20 IST|Sakshi
ఇంక్రిమెంట్‌లో కోత విధింపు చెల్లదు

నియమావళిని పరిశీలించాలి

స్పష్టం చేసిన ఉమ్మడి హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఓ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు అతనికి సంబంధించిన విధుల నియమావళిని సంబంధిత అధికారులు తప్పక పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసింది. విధుల నియమావళిని పరిశీలించకుండా సుధాకర్‌రెడ్డి అనే ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అతని ఇంక్రిమెంట్‌లో కోత విధిస్తూ రవాణాశాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వు లను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. పి.సుధాకర్‌రెడ్డి అనే ఉద్యోగి 2002–03లో ఆదిలాబాద్‌ జిల్లా మంచి ర్యాల ఆర్టీవోగా పనిచేశారు. ఆయన పరిధిలోని వాంకిడి చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేసి అవకతవకలు గుర్తించారు.

ఇక్కడ సుధాకర్‌రెడ్డి తనిఖీలు చేయడం లేదంటూ అతనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఇందులో సుధాకర్‌రెడ్డి తప్పేమీ లేదని విచారణాధికారి తేల్చారు. అయినా అతని ఇంక్రిమెంట్‌లో కోత విధిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సుధాకర్‌రెడ్డి ఏపీఏటీని ఆశ్రయించగా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, విధుల నియమావళి ప్రకారం వాంకిడి చెక్‌పోస్టును పిటిషనర్‌ నెలకు ఒకసారి మాత్రమే తనిఖీ చేయాల్సి ఉందన్నారు.

అంతేకాక మంచిర్యాల నుంచి వాంకిడి 80 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ఏసీబీ తనిఖీకి 3 రోజుల ముందే సుధాకర్‌రెడ్డి చెక్‌పోస్టులో తనిఖీలు చేశారన్నారు. ఏసీబీ ఉదయం 3 గంటల సమయంలో తనిఖీలు చేసిందని, ఆ సమయంలో ఆర్టీవో అక్కడ ఉండటం సాధ్యంకాదని తెలి పారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సుధాకర్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు అతని విధుల నియమావళిని ఉన్నతాధికారులు పరిశీలించలేదన్నారు. ఇది ఎంతమాత్రం సరికాదంటూ సుధాకర్‌రెడ్డి ఇంక్రిమెంట్‌లో కోత విధిస్తూ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.

>
మరిన్ని వార్తలు