లిబియా ఉగ్ర బాధిత కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందం

15 Sep, 2016 19:41 IST|Sakshi

14 నెలల క్రితం లిబియా దేశంలో ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్ గురైన తెలుగు ప్రొఫెసర్ గోపీకృష్ణ ఎట్టకేలకు ఉగ్రవాదుల చెరనుంచి బయటపడ్డాడు. ఈ విషయం స్వయంగా గోపీకృష్ణనే బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు తన భార్య కృష్ణవేణికి ఫోన్ చేసి చెప్పాడు. ‘నేను గోపీకష్ణను మాట్లాడుతున్నాను. ఉగ్రవాదుల చేరనుండి బయటపడ్డాను. నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగా ఉన్నారా?’ అని అడిగాడు. ప్రస్తుతం అమెరికా దేశ మిలిటరీ ఆధీనంలో ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో సంతోషం వెల్లివిరిసింది.
2015 జూలై 28న లిబియా నుంచి హైదరాబాద్‌కు వస్తున్నానంటూ ఫోన్‌లో మాట్లాడిన గోపీకృష్ణ అంతలోనే ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియక కళ్యాణి, కుటుంబసభ్యులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే బుధవారం అర్ధరాత్రి ఫోన్ మోగడం.. గోపీకృష్ణ భార్య కళ్యాణితో మాట్లాడటంతో ఆమె ఉద్వేగానికి గురైంది. గురువారం ఉదయం కళ్యాణి తన పిల్లలతో కలిసి నాచారం రాఘవేంద్రనగర్‌లోని సాయిబాబా గుడికి వెళ్లి తన భర్త క్షేమంగా ఉన్నాడన్న సంతోషంతో ప్రత్యేక పూజలు నిర్వహించింది. తన భర్త విడుదలకు కృషి చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మల్లారెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణ మాట్లాడుతూ.. గోపీకృష్ణ క్షేమంగా ఉన్నాడన్న వార్త మా కుటుంబ సభ్యులలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. గోపీకృష్ణకు పునర్జన్మగా భావిస్తున్నామన్నారు. ఫోన్ సమాచారం మేరకు బుధవారం అమెరికా మిలిటరీ దళాలు లిబియాలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండగా తెలుగు ప్రొఫెసర్లతో పాటు మరో నలుగురు ప్రొఫెసర్లను వారి ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎట్టకేలకు లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదుల చెర నుండి తెలుగు ప్రొఫెసర్లకు విముక్తి కలిగింది. బుధవారం రాత్రి 12 గంటలకు గోపీకృష్ణ తన భార్యతో మాట్లాడాడు. అనంతరం నాన్న నారాయణరావుతో కూడా మాట్లాడినట్లు తెలిపారు.

 

మరిన్ని వార్తలు