లేబర్‌ కోర్టు న్యాయాధికారి గాంధీ అరెస్టు

19 Mar, 2018 00:58 IST|Sakshi

హైడ్రామా మధ్య చంచల్‌గూడ జైలుకు తరలింపు  

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారి మల్లంపేట గాంధీని ఏసీబీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో నాటకీయ పరిణామాల మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాంధీపై కేసు నమోదు చేసిన  ఏసీబీ అధికారులు శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

సికింద్రాబాద్‌ వారాసిగూడలోని గాంధీ నివాసంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో దొరికిన పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాంధీని అరెస్టు చేసి, ఆయన నివాసం నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.   గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు :గాంధీ ఇన్సెంటివ్‌ కేర్‌ యూనిట్‌లో మల్లంపేట గాంధీకి వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ తనకు గుండెపోటు వస్తోందని, కాలేయ సమస్య ఉందని, శ్వాస ఆడటంలేదని చెప్పడంతో సాయం త్రం 5 వరకు వైద్య పరీక్షలు, స్కానింగ్‌లు నిర్వహించారు.

అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ను మెట్టుగూడలోని న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. అనంతరం గాంధీని ప్రత్యేక వాహనంలో చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్న సమయంలో గాంధీ కుటుంబ సభ్యులు, బంధువులు మీడియాను అడ్డుకున్నారు. వీడియోలు, ఫొటోలు తీయరాదంటూ అడ్డంగా నిలబడి హడావుడి చేశారు. కాగా, చంచల్‌గూడ జైలు వైద్యులు గాంధీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు