ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

30 Jan, 2018 02:18 IST|Sakshi

సీఎంకు జూలకంటి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్‌ పథకంలో భాగంగా కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కేజీబీవీలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా మహిళలేనని, వీరికి చెల్లిస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.

రెగ్యులర్‌ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నా వీరిమధ్య వేతనాల్లో ఏమాత్రం పోలిక లేదన్నారు. సెలవుల మంజూరీలోనూ వివక్ష కొనసాగుతోందని, ఉన్నతాధికారులకు ఈ సమస్యలను ఎన్నిసార్లు వివరించినా పరిష్కారం కావడం లేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారని, ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. వారికి హెల్త్‌ కార్డులివ్వాలని, ప్రసూతి సెలవులు వర్తింప చేయాలని జూలకంటి తన లేఖలో సీఎంను కోరారు.

మరిన్ని వార్తలు