కాలేజీ క్యాంటీన్లలో జంక్‌ ఫుడ్‌ నిషిద్ధం

6 Sep, 2017 03:27 IST|Sakshi
కాలేజీ క్యాంటీన్లలో జంక్‌ ఫుడ్‌ నిషిద్ధం
వృత్తి విద్యా కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు 
 
సాక్షి, హైదరాబాద్‌: వృత్తి విద్యా కాలేజీల్లో జంక్‌ ఫుడ్‌ను నిషేధించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. జంక్‌ఫుడ్‌ తినడం వల్ల విద్యార్థులు ఒబెసిటీతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, అందుకే కాలేజీ క్యాంటీన్లలో, ఆవరణలో జంక్‌ ఫుడ్‌ను విక్రయించడానికి, వండటానికి వీల్లేదని పేర్కొంది. ఈ నిబంధనను తమ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్‌మెంట్‌ కాలేజీ యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని వెల్లడించింది. కాలేజీల ఆవరణలో విక్రయించే ఆహార పదార్థాలను ఆయా యాజమాన్యాలే నియంత్రించాలని, విద్యార్థులు వాటిని తినకుండా చూడాల్సిన బాధ్యత కాలేజీలదేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 10 వేల కాలేజీల్లో ఈ నిబంధనల అమలుకు యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది. దీనిని రాష్ట్రంలో 500కు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, నర్సింగ్‌ కాలేజీ యాజమాన్యాలు అన్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.
 
సిగరెట్, గుట్కా, డ్రగ్స్‌ నిషేధం 
విద్యాలయాల ఆవరణలో సిగరెట్, గుట్కా, డ్రగ్స్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్థాలు కాలేజీల ఆవరణలో ఉండటానికి వీల్లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. వాటిని వినియోగించకుండా విద్యా ర్థులకు అవగాహన కల్పించాలని పేర్కొంది. కాలేజీల్లోని ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల నేతృత్వంలో విస్తృత అవగాహన , ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని వివరించింది.  
మరిన్ని వార్తలు