స్వర్గధామం

16 Jan, 2015 23:02 IST|Sakshi
స్వర్గధామం

విశాలమైన ప్రాంగణం... అందులో కొలువుదీరిన అద్భుత భవనం. వందకు పైగా గదులు... లెక్కకు మించి అశ్వాలు... పాడి ఆవులు. కళకళలాడే ఫర్నిచర్... కళ్లు చెదిరే కళాకృతులు... క్రీడా ప్రాంగణాలు. స్వర్గాన్ని తలపించే అలనాటి ఎర్రమంజిల్ ప్యాలెస్ దర్పం ఇది. ఖైరతాబాద్- పంజగుట్ట మధ్యన నిర్మించిన ఈ భవనం నాటి నగర వైభవానికి సాక్ష్యం.
 
‘ఎర్రమంజిల్’ పర్షియన్ పదం. దీనికి అర్థం... ‘స్వర్గంలో నిర్మించుకున్న అందమైన భవనం’ అని చెబుతారు. 1870 ప్రాంతంలో నవాబ్ ఫక్రూల్ ముల్క్ బహదూర్ దీన్ని నిర్మించారు. ఈయన ఆరో నిజాంకు అత్యంత సన్నిహిత స్నేహితుడే కాదు, ఆయన ఆస్థానంలో పోలీసుల, న్యాయశాఖల మంత్రిగా కూడా ఉన్నారు. ఈ అందాల  సౌధం రెండు అంతస్తుల్లో, ఇండో-యూరోపియన్ శైలిలో నిర్మించారు. ఈ ప్యాలెస్ మొత్తం విస్తీర్ణం 1.13 లక్షల చదరపు అడుగులని అంచనా.

ప్యాలెస్ లోపల చక్కని కళాకృతులతో పాటు ఫర్నిచర్ హంగులు ఆకట్టుకుంటాయి. అలాగే అత్యంత విశాలమైన డైనింగ్ హాలు ఈ ప్యాలెస్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణ. భవనం లోపల సుమారుగా 150కి పైగా గదులున్నాయి. ఆ రోజుల్లోనే దీని నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంచనా. ఎర్రమంజిల్ ప్రాంగణంలోనే విశాలమైన గోల్ఫ్, పోలో క్రీడా కోర్టులుండేవి. 200 అశ్వాలు, మరెన్నో పాడినిచ్చే ఆవులు, గేదెలకు ఆలవాలంగా ఉండేది. ఆనాటి రాచరికపు విందులు, అనేక అధికార కార్యక్రమాలు ఈ ప్యాలెస్‌లోనే జరిగేవి. అంతేకాదు, పాయిగాలు నిర్మించిన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను తలదన్నేలా ఎర్రమంజిల్ ఉండాలన్నది ఈ భవన నిర్మాత తలపోశారని చరిత్రకారులు చెబుతారు.

భారత స్వాతంత్య్రానంతరం ఎర్రమంజిల్ ప్యాలెస్ ముందుగా పబ్లిక్ వర్క్స్ శాఖ వారి ఆధీనంలోకి వచ్చింది. ఆ తరువాత రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోని రోడ్లు, భవనాలు, సాగునీటి పారుదల శాఖల కార్యాలయాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మండుటెండాకాలంలో కూడా చల్లగా ఉండే ఈ భవనం వారసత్వపు వాసనలు స్థానిక అధికారులు, సిబ్బందిలో చాలా కొద్ది మందికే తెలుసు.

ఈ క్రమంలో రాచఠీవీతో అలరారుతున్న ఎర్రమంజిల్ విశిష్టతను తెలియజెప్పేలా ఇక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలనేది చరిత్రకారుల అభిప్రాయం. రోజురోజుకూ శిథిలావస్థకు చేరుతున్న ఈ ప్యాలెస్‌కు తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఈ రాచరికపు భవనాన్ని పర్యాటక శాఖ సిటీ టూర్ ప్యాకేజీల్లో చేర్చాలి. తద్వారా దీని విశిష్టత మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు