సిటీలో కబాలి రికార్డులు

22 Jul, 2016 09:24 IST|Sakshi
సిటీలో కబాలి రికార్డులు

సాక్షి, సిటీబ్యూరో: సూపర్ స్టార్ రజనీకాంత్‌ సంచలన చిత్రం కబాలి. మేనియా ఇప్పుడు సిటీకి పట్టుకొంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా నగరంలోని 360 థియేటర్‌లలో 1440 ప్రదర్శనలతో శుక్రవారం రికార్డులు బద్దలు కొడుతూ విడుదలవుతోంది.

నగరంలోని రికార్డులు వరుసగా..
♦   నగరంలో సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అత్యధికంగా 200 థియేటర్‌లలో  విడుదల అవుతాయి. ‘బాహుబలి’ ఆ రికార్డును బ్రేక్‌ చేస్తూ 250 థియేటర్‌లలో విడుదలైంది.
♦ ఇప్పుడు ‘కబాలి’ ఏకంగా 360 థియేటర్‌లలో విడుదలవుతోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్, ఉప్పల్, సికింద్రాబాద్, మెహదీపట్నం, కూకట్‌పల్లి, ఈసీఐఎల్, పంజగుట్ట తదితర అన్ని ప్రాంతాల్లోని థియేటర్‌లు అడ్వాన్స్‌ బుకింగ్‌లతో హోరెత్తిపోతున్నాయి.
మల్టీప్లెక్స్‌లలో  180 ప్రదర్శనలు....
♦నగరంలోని మల్టీప్లెక్స్‌లలో బుధవారం రాత్రి 10 గంటలకు అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించిన పావుగంటలోనే ఏకంగా 3 రోజుల టిక్కెట్లు బుక్‌ అయ్యాయి.
♦ శుక్రవారం సినిమా విడుదల రోజున నగరంలోని అన్ని మల్టీప్లెక్స్‌లలో కలిసి 180 షోలు ప్రదర్శిస్తున్నారు.
♦చాలాచోట్ల  మల్టీఫె్లక్స్‌లలో ఉదయం నుంచి రాత్రిదాకా అన్ని స్క్రీన్‌లపైన కబాలి ఆడబోతున్నది.
♦ మరోవైపు  అనేక కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు  కబాలి సినిమా టిక్కెట్‌లను గిఫ్ట్‌గా ఇవ్వడానికి పెద్ద మొత్తంలో బల్క్‌బుకింగ్‌లు చేశాయి.
♦ చాలావరకు మల్టీప్లెక్స్‌ థియేటర్‌లు కార్పొరేట్‌ సంస్థల బుకింగ్‌లతోనే నిండిపోయాయి. మూడు, నాలుగు రోజుల వరకు  కార్పొరేట్‌ సంస్థలే  కబాలి  షోలను కొనుగోలు చేసినట్లు థియేటర్‌ల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
♦ఇక టిక్కెట్‌ల కోసం మల్టీప్లెక్స్‌ల వద్ద నానా తిప్పలుపడ్డ అభిమానులు పలువురు తమకు తెలిసిన రాజకీయ నేతలు, పోలీసులు, ఇతర అధికారులను ఆశ్రయించారు. టిక్కెట్‌ల  కోసం పైరవీలు చేస్తున్నారు.
♦కెపిహెచ్‌బి కాలనీలోని  సినీపోలీస్, పీవీఆర్‌ సినిమా మాల్స్‌ తదితర థియేటర్‌లు వచ్చే ఆదివారం వరకు అడ్వాన్స్‌ బుకింగ్‌లతో నిండిపోయాయి. గత రెండు రోజులుగా జనం ఈ థియేటర్‌ల వద్ద టిక్కెట్‌ల కోసం పడిగాపులు కాశారు.
♦జనం రద్దీని గమనించిన నిర్వాహకులు గురువారం ఏకంగా టికెట్లు అయిపోయాయని మైకుల్లో  ప్రచారం చేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు