కడియం చెప్పిన 'ఎద్దు-కుక్క' కథ!

13 Aug, 2015 08:15 IST|Sakshi
కడియం చెప్పిన 'ఎద్దు-కుక్క' కథ!

* ఎర్రబెల్లిని పరోక్షంగా కుక్కతో పోల్చిన డిప్యూటీ సీఎం
* తన కులం తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్: టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలపై సమాధానం చెప్పడం ఇష్టం లేకపోయినా ప్రజల కోసం చెప్పాల్సి వస్తోందన్నారు. బుధవారం సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. తాను చెబితేనే కడియంకు మంత్రి పదవి వచ్చిందని, అది తన భిక్షే అంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను కొందరు విలేకరులు ప్రస్తావించగా కడియం స్పందించారు.

దయాకర్‌రావును ఉద్దేశించి ఎద్దు-కుక్క కథను చెప్పుకొచ్చారు. ‘‘ఎండాకాలంలో ఒక రైతు బావి వద్ద ఉన్న గడ్డిని తన ఎడ్ల బండిలో మెలుక్కొని ఇంటికి వస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ్నుంచో ఆ దారిలో వచ్చిన ఓ కుక్క.. ఎండ వేడిమి తట్టుకోలేక ఆయాసం వచ్చి బండి కింద నీడలో నడుస్తూ ఇంటి వరకు వచ్చింది. ఇంటికి వచ్చాక బండి కింది నుంచి బయటకు వచ్చి ‘అబ్బ! ఇంత పెద్ద బండిని అక్కడ్నుంచి లాక్కొచ్చిన’ అని అనుకుందంట. బయటకు వచ్చి అదే బండిని లాక్కొచ్చిన ఎద్దు వైపు చూసింది. అప్పుడు ఎద్దు కొంత ఆయాస పడుతోంది.

‘నేను సునాయాసంగా లాక్కొచ్చాను.. నీవు ఇంత లావువున్నావు.. నీవెందుకు ఆయాస పడుతున్నావు..’ అని కుక్క ఆ ఎద్దును అడిగిందట. అప్పుడు ఎద్దు కుక్క వైపు చూసి.. పాపం ఈ కుక్కకు ఏమి తెలియదని సెలైంట్‌గా ఉందట. కానీ ఆ కుక్క ఎద్దును ఎక్కిరిస్తూ పోయిందట. ‘హా.. అది ఎంతైనా కుక్కే కదా!’ అని ఎద్దు అనుకుందట..’’ అని కడియం చెప్పారు. ‘మీరు ఎర్రబెల్లిని కుక్కతో పోల్చుతున్నారా’ అని ప్రశ్నించగా.. ఆ మాట తాను అనలేదని, మేధావులైన మీకు అర్థమై ఉందనుకుంటానని విలేకరులతో అన్నారు.

‘‘ఆయన నా పుట్టుకను, నా కులాన్ని, రాజకీయాన్ని కాంట్రవర్సీ చేయాలని చూస్తాడు. అవకాశాలు కలిసి వచ్చాయి. నేనేం చేయాలి’’ అని పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు, కులాన్ని తప్పుగా చూపించినట్లు ఆధారాలతో వస్తే పదవికి రాజీనామా చేస్తానని, ప్రజలకు క్షమాపణ చెబుతానని స్పష్టంచేశారు. ఓసారి ఎర్రబెల్లి, మరోసారి మోత్కుపల్లి, ఇంకోసారి సర్వే తన గురించి, తన కులం గురించి మాట్లాడుతున్నారన్నారు. తనను, తన కులాన్ని అవమానిస్తే చట్టపరంగా చర్యలు చేపడతానన్నారు.

మరిన్ని వార్తలు