‘కాకతీయ’కు పునరుజ్జీవం!

4 May, 2016 03:15 IST|Sakshi
‘కాకతీయ’కు పునరుజ్జీవం!

- మూడు నెలల్లో పూర్తి కానున్న ప్రధాన కాల్వఆధునీకరణ పనులు
- వేగంగా ప్రధాన కాల్వ ఆధునీకరణ పనులు
- రూ.180 కోట్ల పనుల్లో ఇప్పటికే రూ.100 కోట్ల పనులు పూర్తి
- దిగువ మానేరు కాల్వ పనులు 70 శాతం పూర్తి
- పనులు పూర్తయితే కాల్వల సామర్థ్యం పూర్వ స్థితికి
- సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు

 
 సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ద్వారా ఉత్తర తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాకతీయ కాల్వ ఆధునీకరణ వేగం పుంజుకుంది. ముప్ఫై ఏళ్ల కింద నిర్మించిన కాల్వకు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి ఆధునీకరించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాకతీయ కాల్వ ఆధునీకరణ కోసం నాలుగు నెలల కిందట రూ.180 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా అందులో ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను రెండు, మూడు నెలల్లో పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
 భారీగా తగ్గిన ప్రవాహ సామర్థ్యం..
 ఎస్సారెస్పీలో భాగంగా ఉండే కాకతీయ కాల్వ ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో మొత్తంగా 9,68,640 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా ఉండేది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి మానేరు వరకు 146 కిలోమీటర్ వరకు ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం వాస్తవానికి 9,700 క్యూసెక్కులు. కానీ కాల్వలో చాలాచోట్ల పూడిక, పిచ్చిమొక్కలు పెరగడం, సిమెంట్ నిర్మాణాలు దెబ్బతినడంతో దాని ప్రవాహ సామర్థ్యం 5 వేలకు పడిపోయింది. దీంతో ఎగువ మానేరులో ఉన్న సుమారు 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందడం గగనంగా మారింది.
 
 దీంతోపాటే మానేరు దిగువన 146 కిలోమీటర్ నుంచి 234 కిలోమీటర్ వరకు కాల్వ ప్రవాహ సామర్థ్యం 8,505 క్యూసెక్కులు ఉండగా, అది 3 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో దిగువన మానేరులో ఉన్న 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కాల్వల ఆధునికీకరణ చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావును ఆదేశించారు. దీంతో హరీశ్‌రావు అధికారులతో సమీక్షించారు. ఆర్థిక శాఖ అధికారుల సహాయం తో కాల్వ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.185 కోట్లను విడుదల చేసి నామినేషన్ పద్ధతిన అప్పగించారు.
 
 రూ.100 కోట్ల పనులు పూర్తి..
 పూడిక, మొక్కల తొలగింపుతోపాటు సిమెంట్ నిర్మాణాల బలోపేతానికి సత్వర మరమ్మతులు చేయాలని ఎగువ మానేరు పనులకు రూ.60 కోట్లు కేటాయించగా, దిగువన కాకతీయ కాల్వ 146 కిలోమీటర్ నుంచి 191 కిలోమీటర్ వరకు ఆధునికీకరణ చేసేందుకు రూ.64.25 కోట్లు, 191 కిలోమీటర్ నుంచి 234 కిలోమీటర్ వరకు ఆధునికీకరించేందుకు రూ.60.65 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ పనులను జూన్, 2016 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేస్తే ఒక శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని, ఒకవేళ పూర్తిచేయని పక్షంలో 2% జరిమానా విధించడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా టెండర్ నిబంధనలను సవరించారు.ఈ నిబంధనల నేపథ్యంలో కాంట్రాక్టర్లు పనులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పనులు చేపట్టారు. దీంతో ప్రస్తుతం వరకు దిగువ మానేరులో రూ.125 కోట్ల పనుల్లో 70% పనులు పూర్తయ్యాయి.
 
 సుమారు రూ.80 కోట్ల పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక ఎగువ మానేరులో రూ.60 కోట్ల పనుల్లో 35 నుంచి 40% పనులు పూర్తయ్యాయని మరో రూ.40 కోట్ల పనులు మిగిలాయని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో పనులకు ఆటంకం జరుగుతోంది. మొత్తంగా రూ.100 కోట్ల పనులు పూర్తవగా, నిర్ణీత గడువులోగా మిగతా పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు