కాళేశ్వరం కార్పొరేషన్ రిజిస్ట్రేషన్‌కు అనుమతి

3 Jan, 2016 02:16 IST|Sakshi

♦ రూ. 82.32 లక్షలు చెల్లించడానికి ఉత్తర్వులు
♦ వాటాల్లో 7 షేర్లు మినహా మిగతావన్నీ గవర్నర్ పేరిటే
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రీ ఇంజనీరింగ్ చేస్తూ చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అమలు, నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్’ ను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదు చేయించడానికి అయ్యే రూ.82.32 లక్షల ఫీజును చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శనివారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో కార్పొరేషన్‌లో వాటాల అంశాన్ని స్పష్టంగా తెలియజేశారు. కార్పొరేషన్‌లో మొత్తం నూరు శాతం వాటాలూ ప్రభుత్వానికే ఉంటాయి. రూ.10 ముఖ విలువ కలిగిన రూ.10 కోట్ల షేర్లలో ఏడు షేర్లు మినహా మిగతావన్నీ గవర్నర్ పేరిట ఉండనున్నాయి.

మిగతా ఏడు షేర్లు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్‌సీ, ట్రాన్స్‌కో డెరైక్టర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ప్రాజెక్టు సీఈ, నీటి పారుదల శాఖ డిప్యూటీ సెక్రటరీ, భూగర్భ శాఖ డెరైక్టర్ పేరిట ఒక్కోటి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రాజెక్టు డిజైన్ మొదలు, ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ, వినియోగం, నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పూర్తి.. తదితర బాధ్యతలన్నీ ఈ కార్పొరేషన్ చూసుకుంటుంది. పూర్తి స్వేచ్ఛతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు దీనికి కల్పించారు. కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం సమకూర్చనుండగా, మిగతా నిధులను కార్పొరేషనే సమకూర్చుకోవాల్సి ఉంది. కార్పొరేషన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నేతృత్వం వహిస్తారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు