ఆయకట్టుకు ‘శ్రీరామ’రక్ష!

19 Jun, 2017 01:58 IST|Sakshi
ఆయకట్టుకు ‘శ్రీరామ’రక్ష!
- శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు 
ఎస్సారెస్పీ–వరద కాల్వ లింకుతో 11 లక్షల ఎకరాల స్థిరీకరణ
 
సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ ఇక కళకళలాడనుంది! ప్రాజెక్టు పరిధిలోని లక్షల ఎకరాల ఆయకట్టుకు ‘కాళేశ్వరం’ నీళ్లతో భరోసా లభించనుంది. ఎగువ నుంచి వరదొచ్చినా రాకున్నా, ప్రాజెక్టు పరిధిలో వర్షాలు కురిసినా కురవకున్నా.. ఇక నీళ్లకు ఢోకా ఉండబోదు. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వెళ్లే ప్రధాన కాల్వ నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజులపాటు 60 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సారెస్పీ–ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ) లింకు పథకం ద్వారా 11 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 40 ఎకరాల భూసేకరణ మాత్రమే అవసరం కానుంది. తక్కువ వ్యయం, తక్కువ ముంపు గరిష్ట ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం ఈ పథకానికి ప్రాధాన్యం ఇస్తోంది.
 
వెయ్యి కోట్లతో అనుమతులు..
గోదావరిలోని 75 శాతం డిపెండబులిటీ జలాల ప్రకారం ఎస్సారెస్పీకి 196 టీఎంసీల నీటి లభ్యత ఉండాల్సింది. అయితే ఎగువన మహారాష్ట్ర కట్టిన వివిధ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కారణంగా దిగువకు ప్రవాహాలు పడిపోయాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వచ్చే గోదావరిలో నీటి లభ్యత గత ఇరవై ఏళ్లలో 196 టీఎంసీల నుంచి 54 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు ఈ నీటిపై ఆధారపడిన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వల కింది ఆయకట్టుకు, గుత్పా, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన 95 టీఎంసీల నీటి అవసరాల్లో భారీగా కొరత ఏర్పడుతోంది.

ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం నీటిని హల్దీవాగు ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ఒక ప్రతిపాదన రాగా, ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరకు వరుసగా 11 బ్యారేజీలు నిర్మాంచాలని మరో ప్రతిపాదన వచ్చింది. అయితే దీనికి సుమారు రూ.30 వేల కోట్ల భారీ వ్యయం అయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని ఎఫ్‌ఎఫ్‌సీ (ఇందిరమ్మ వరద కాల్వ) ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని నిర్ణయించింది. దీనికి రూ.1,067 కోట్లతో అనుమతులు ఇచ్చింది. ఈ పథకం అమల్లోకి వస్తే ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ కెనాల్‌ కింద 5.50 లక్షల ఎకరాలు, సరస్వతి కెనాల్‌ కింద 40 వేలు, లక్ష్మీ కెనాల్‌ కింద 20 వేలు, కాళేశ్వరం ప్యాకేజీ 27, 28 కింద లక్ష ఎకరాలు, ప్యాకేజీ 21, 22 కింద 3.50 లక్షలు, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని వివిధ లిఫ్ట్‌ పథకాల కింద మిగతా ఆయకట్టును స్థిరీకరించవచ్చు.

ఇలా ఎఫ్‌ఎఫ్‌సీకి ఇరువైపులా దాదాపు లక్ష ఎకరాల గ్యాప్‌ ఆయకట్టు ఉన్నది. ఇందిరమ్మ వరద కాల్వ తవ్వకాలు జరిపినపుడు చుట్టు పక్కలలో ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎండిపోయాయి. కాల్వల దగ్గర తలపెట్టిన తూముల నిర్మాణంతో నీటిని లిఫ్ట్‌ చేసుకొని రైతులు పంపుల ద్వారా నీటిని తరలించుకోవచ్చు. దీంతో పాటే మిషన్‌ భగీరథకు అవసరమైన 7.76 టీఎంసీల నీటి అవసరాలను సైతం ఈ పథకం తీర్చుతుంది. ఇక ఎస్సారెస్పీకి ప్రవాహాలు పెరిగి వరదలు వచ్చినా ముందున్న ప్రణాళికల ప్రకారం ఎఫ్‌ఎఫ్‌సీ నుంచి మిడ్‌ మానేరుకు నీటిని మళ్లించవచ్చు. నీళ్లున్నప్పుడు ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు కొనసాగనుండగా, నీళ్లు లేనప్పుడు దిగువ నుంచి ఎగువకు నీటిని తీసుకుంటారు.
 
నీటి రివర్స్‌ పంపింగ్‌ ఇలా..
రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజులపాటు 60 టీఎంసీలను మూడు స్టేజ్‌ల ద్వారా రివర్స్‌ పంపింగ్‌ చేసి ఎస్సారెస్పీకి తరలిస్తారు.
కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వెళ్లే ప్రధాన కాల్వను 102వ కి.మీ. వద్ద వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ) క్రాస్‌ చేస్తుంది. ఇక్కడ్నుంచి ఒక టీఎంసీ నీటిని 68వ కి.మీ., 32వ కి.మీ. వద్ద రెండు దశల్లో 5 పంపుల ద్వారా 8828 క్యూసెక్కుల నీటిని 10 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌ చేస్తారు.
► తర్వాత 18వ కి.మీ. వద్ద మరో 5 మోటార్లతో 11 మీటర్ల మేర నీటిని లిఫ్ట్‌ చేస్తారు.
► ఈ మూడు స్జేజీల విధానం ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ జలాశయానికి చేరతాయి. 
 
నేడు టెండర్లు..
ఈ పథకానికి సోమవారం టెండర్లు పిలిచేలా నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. 20 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏడాదిలో దీన్ని పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకుంది.
>
మరిన్ని వార్తలు