కనీసం సొంత భవనం లేదు!

23 Jul, 2017 03:15 IST|Sakshi
కనీసం సొంత భవనం లేదు!
ఇదీ కాళోజీ ఆరోగ్య వర్సిటీ దుస్థితి
- వర్సిటీ ఏర్పాటై మూడేళ్లయినా.. నిలువ నీడ లేదు
కాకతీయ వర్సిటీకి చెందిన పాత భవనంలోనే పాలన
 
సాక్షి, హైదరాబాద్‌: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్సిటీ ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సొంత భవనం లేని పరిస్థితి నెలకొంది. వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలకు చెందిన ఓ పాత భవనంలోనే వర్సిటీ పాలన నడుస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్య కోర్సుల సీట్ల భర్తీకి జూలై 22న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ మొదలైంది. వరంగల్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియకు కాళోజీ వర్సిటీలో స్థలం లేక కాకతీయ వర్సిటీలో నిర్వహిస్తున్నారు. స్వయంగా ఆరోగ్య విశ్వవిద్యాలయంలోనే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసే వ్యవస్థ, వసతి లేకపోవడంతో వర్సిటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
 
రూ.45 కోట్లతో భవనం నిర్మాణానికి ప్రణాళిక
ఉమ్మడి ఏపీలో వైద్య విద్య నిర్వహణ కోసం విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వైద్య విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వరంగల్‌లో కాళోజీ నారాయణరావు పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీ పరిపాలన, ఇతర అవసరాల కోసం భవనాలను నిర్మించేందుకు రూ.130 కోట్లను కేటాయించింది. అందులో రూ.45 కోట్లతో పరిపాలన భవనం నిర్మించేలా ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు చెందిన స్థలంలో భవనం నిర్మించేలా ప్రభుత్వం అనుమతులూ ఇచ్చింది. పరిపాలన భవనం నిర్మాణం కోసం 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ గజ్వేల్‌లో శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పరిపాలన భవనం నిర్మాణం బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. టీఎస్‌ఎంస్‌ఐడీసీ ఆలస్యంగా టెండరు ప్రక్రియ మొదలు పెట్టింది. రూ.20 కోట్లతో భవనాన్ని నిర్మించేలా కొత్త ప్లాన్‌ రూపొందిం చింది. ఇంకా టెండరు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. 
మరిన్ని వార్తలు