జై రాం రమేష్ ... ఖబడ్దార్ : కేసీఆర్

12 Apr, 2014 14:18 IST|Sakshi
జై రాం రమేష్ ... ఖబడ్దార్ : కేసీఆర్

కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్పై టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్లో కేసీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... సర్పంచ్గా కూడా గెలవలేని జైరాం రమేష్ తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోమని ...ఖబడ్దార్, జాగ్రత్తగా మాట్లాడు అంటూ జై రాం రమేష్పై కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆచరణ సాధ్యమైన అంశాలన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని చెప్పారు. అయితే టీఆర్ఎస్ మేనిఫెస్టోని కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఆయన విమర్శించారు.

ఈ నెల 16 నుంచి తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. 3 డీ టెక్నాలజీ ద్వారా 700 సభలు తెలంగాణలో నిర్వహిస్తామని తెలిపారు. 3 డీ టెక్నాలజీ కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేసిన విజయం మాత్రం టీఆర్ఎస్ పార్టీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలుపే ధ్యేయంగా టికెట్లు కేటాయించడం వల్ల కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోయామని... అయితే రానున్న రోజుల్లో వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.  బీసీలను సీఎం చేస్తామన్న టీడీపీ పార్టీ కేవలం 15 సీట్లిస్తే తమ పార్టీ 30 సీట్లు బీసీలకు కేటాయించామని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు