..అలాగైతే మేం దేశద్రోహులమే : కన్హయ్య

1 Aug, 2016 05:18 IST|Sakshi
..అలాగైతే మేం దేశద్రోహులమే : కన్హయ్య

దేశంలో మోదీస్వామ్యం: కన్హయ్య కుమార్
* అణగారిన వర్గాల గురించి గళం విప్పుతుంటే మాపై జాతి వ్యతిరేక ముద్ర
* బీఫ్ తినే వారిపై జంతు సంరక్షణ పేరుతో దాడులు, హత్యలు
* వర్సిటీల్లో వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం కోసం కృషి
* హైదరాబాద్‌లో ‘థీమాటిక్ సోషల్ ఫోరం’ వర్క్‌షాప్ ప్రారంభం
* వివిధ యూనివర్సిటీల నుంచి విద్యార్థి నేతల హాజరు

సాక్షి, హైదరాబాద్: మతోన్మాదాన్ని వ్యతిరేకించడమే దేశద్రోహమైతే తామంతా దేశద్రోహులమేనని ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు.

ప్రధాని పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం పతనమై మోదీస్వామ్యం నడుస్తోందని... మహిళలు, దళితులు, ముస్లింల అణచివేత విధానాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. అఖిల భారత థీమాటిక్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో (ఆర్టీసీ కల్యాణ మండపంలో) ప్రారంభమైన రెండ్రోజుల వర్క్‌షాప్ (డిగ్నిటీ, డైవర్సిటీ, డెమోక్రసీపై)లో, విలేకరుల సమావేశంలో కన్హయ్య ఇదే అంశంపై మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రజాస్వామ్య పునాదులను పెకిలించే ప్రయత్నం చే స్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారినవర్గాల గురించి గళం విప్పే వాళ్లందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని, కానీ తాము ఆ ‘బిరుదు’ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

తిండి విషయంలోనూ ప్రజలకు స్వేచ్ఛ లేని పరిస్థితి దేశంలో నెలకొందని విమర్శించారు. చనిపోయిన జంతువుల కోసం కొందరు మనుషుల ప్రాణాలను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తినడం ఒక ఆహారపు అలవాటు అని, ప్రపంచంలోని అనేక దేశాల్లో బీఫ్ తింటున్నా దేశంలో మాత్రం ధర్మం, జంతు సంరక్షణ పేరుతో బీఫ్ తినే వారిపై దాడులు జరుగుతున్నాయన్నారు. హెచ్‌సీయూ పరిస్థితుల్లో మార్పు రాలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని కన్హయ్య పేర్కొన్నారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జాతి వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం తెచ్చేలా కృషి చే యాలన్నారు. హెచ్‌సీయూలో మీడియానూ అడ్డుకుంటున్నారని, రోహిత్ ఆత్మహత్య తరువాత కూడా వర్సిటీలోని పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. విద్యావ్యవస్థలో అవినీతి దేశవ్యాప్తంగా ఉందని, ఎంసెట్-2 పేపర్ లీకేజీ అందులో భాగమేనని కన్హయ్య పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన హెచ్‌సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలపై ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయకపోవడం మన వ్యవస్థలోని అసమానత్వానికి నిదర్శనమని విమర్శించారు.
 
ఎందరో వివక్ష ఎదుర్కొంటున్నారు: రాధిక వేముల
అంతకుముందు థీమాటిక్ సోషల్ ఫోరం కార్యక్రమాన్ని రోహిత్ వేముల తల్లి రాధిక ప్రారంభిస్తూ దేశంలో తన కొడుకు లాంటి బిడ్డలెందరో వివక్ష ఎదుర్కొంటున్నారని, వారందరి పక్షాన పోరాడేందుకు తాను సిద్ధమన్నారు. కార్యక్రమానికి మోహన్ ధరావత్ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేశారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే తదితరులు ప్రసంగించారు. కశ్మీర్ లోయలో ఇటీవలి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారితోపాటు ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి, రోహిత్ వేముల, ఇతర అమరవీరులకు సభ నివాళులర్పించి రెండు నిముషాల పాటు మౌనం పాటించింది.
 
హిందుత్వ శక్తుల నుంచి వివక్ష: రిచాశర్మ
మహిళలు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను హిందుత్వ శక్తులు వివక్షకు, అణచివేతకు గురిచేస్తున్నాయని అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం తొలి అధ్యక్షురాలు రిచాశర్మ విమర్శించారు. ఇదే జాతీయతైతే దాన్ని ప్రతిఘటించడానికి తామంతా సిద్ధమన్నారు. ఐశ్వర్యం, అధికారంకన్నా స్వాభిమానం కోసమే పోరాటమని చాటిన అంబేడ్కర్ ఆదర్శాల దారిలో తమ ఉద్యమ ప్రస్థానం సాగుతోందని హెచ్‌సీయూ అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొంత ప్రశాంత్ పేర్కొన్నారు.

దేశంలో వేల సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు, వెలివాడల మధ్య సమరం జరుగుతోందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నలిగంటి శరత్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు సుధాన్యాపాల్, పుణే ఫిల్మ్ యూనివర్సిటీ విద్యార్థి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు