ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ లాయర్లు

26 Jul, 2017 14:34 IST|Sakshi
ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ లాయర్లు

హైదరాబాద్‌: కిర్లంపూడిలో ఏపీ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని కాపు న్యాయవాదుల సంఘం ప్రతినిధి వేపకాయల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా హైకోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ముద్రగడ పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా రామకృష్ణ 'సాక్షి'తో మాట్లాడుతూ...  ప్రభుత్వ వైఖరి చూస్తుంటే పరాయిదేశంలో ఉన్నామన్న భావన కలుగుతోందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సర్కారు కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి మింగుడు పడని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలీసులను స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. బైండేవర్‌ చేస్తాం, కేసులు పెడతామనని పోలీసులు బెదిరించడం సరికాదన్నారు.

కాపులను బీసీల్లో చేరుస్తామని 2014లో చంద్రబాబు స్పష్టమైన హామీయిచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని మాత్రమే కాపులు కోరుతున్నారని తెలిపారు. పాదయాత్రకు రెండు నెలల క్రితం అనుమతి కోరారని వెల్లడించారు. ముద్రగను గృహనిర్బంధం చేయడాన్ని ఆయన ఖండించారు. కిర్లంపూడిలో పోలీసు రాజ్యాన్ని సృష్టించి, సామాన్య ప్రజలకు ఇబ్బందులను గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించినట్టు రామకృష్ణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు